సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయమైన చిత్రం ‘హీరో’. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో గల్లా పద్మావతి నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ “థియేటర్‌లో ప్రేక్షకుల పాజిటివ్ స్పందనను చూశాక మరచిపోలేకపోతున్నా. ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. జగపతిబాబు, బ్రహ్మాజీ అద్భుతంగా నటించారు. నరేష్, మైమ్ గోపీ, రోల్ రిడా పాత్రలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు”అని అన్నారు.
నిర్మాత పద్మావతి గల్లా మాట్లాడుతూ “యూత్, ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా ఇది. థ్రిల్లర్, కామెడీ సినిమాకు హైలైల్. దర్శకుడు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తీశాడు”అని తెలిపారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ “హీరో సినిమా విడుదలైన థియేటర్లలో నిజమైన పండుగలా ఉంది. అశోక్ పడిన కష్టం చక్కగా కనిపించింది. ప్రేక్షకులను నవ్వించాలనే ఈ సినిమా తీశాం”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గల్లా జయదేవ్, నిధి అగర్వాల్, జగపతిబాబు, బ్రహ్మాజీ, నరేష్, రోల్ రిడా పాల్గొన్నారు.