కింగ్ నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ శుక్రవారం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అషిసోర్ సోల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సయామీఖేర్ ఓ కీలక పాత్రను పోషించారు. ఈ సినిమా విడుదలను పురస్కరించుకొని కింగ్ నాగార్జున మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు..
ఆద్యంతం అలరిస్తుంది…
ఇది న్యూ ఏజ్ సినిమా. కథాంశం యూనిక్‌గా ఉంటూ ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుంది. తీవ్రవాదం, ఎన్‌ఐఏ ఆపరేషన్ నేపథ్యంలో వినోదాత్మక చిత్రమిది. స్క్రీన్ ప్లే ఆద్యంతం రక్తి కట్టిస్తుంది.
కొత్త దర్శకుల వల్లనే పెద్ద స్టార్‌నయ్యా…
నా కెరీర్‌లో 48 మంది కొత్త దర్శకులను పరిచయం చేయడం నిజంగా ఆశ్చర్యపరిచేదే. కొత్త దర్శకులతో పని చేస్తే కొత్తగా ఉంటుంది. నాకు కొత్తగా ఉంటుంది. కొత్తగా చేయకపోతే నాకే బోర్ కొడుతుంది. అవే డ్రెస్‌లు, అవే కథలతో రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయలేను. కొత్తవారిని పరిచయం చేస్తే దెబ్బలు తింటాం. కానీ సక్సెస్ వస్తుంది. నేను ఇంత పెద్ద స్టార్ అయ్యానంటే కొత్త దర్శకుల వల్లనే.
ముందుగా ‘వైల్డ్ డాగ్’ మొదలుపెట్టాం…
2019 ఆగస్టులో ‘వైల్డ్ డాగ్’ కథ విని ఓకే చేశాను. ‘బంగార్రాజు’కి సిద్ధమవుతున్న సమయంలో ఈ స్కిప్టు వచ్చింది. 60, 70 రోజుల్లో అయిపోతుందని ‘వైల్డ్ డాగ్’ మొదలు పెట్టాం. 2019 డిసెంబర్‌లో షూట్ మొదలు పెట్టి.. ఫిబ్రవరి, మార్చి వరకూ షూటింగ్ చేశాం. ఆ తర్వాత థాయ్‌లాండ్ వెళ్లాలి. కానీ లాక్‌డౌన్ వల్ల అక్కడికి వెళ్లలేకపోయాము. తర్వాత లాక్ డౌన్ వల్ల 50 శాతం పెండింగ్ షూట్ అలా ఉండిపోయింది. లాక్ డౌన్ తొలగించి షూటింగులకు అనుమతించాక సినిమాను పూర్తి చేశాం.
యాక్షన్ డిఫరెంట్‌గా…
ఈ సినిమాలోని నా పాత్ర నా కెరీర్‌లో చెప్పుకునే స్పెషల్ రోల్ అవుతుంది. అలాగే యాక్షన్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఫైట్స్ కొత్త తరహాలో ఉంటాయి. ఇవి అందరికీ నచ్చుతాయి.
వయోలెంట్ పాత్రలో కనిపిస్తా…
విజయ్ వర్మ ఒక మంచి తండ్రి, మంచి టీమ్ లీడర్. అతను అనుకున్నది సాధిస్తాడు. దేశం అంటే ప్రాణం. ఎన్.ఐ.ఏ ద్వారా తీవ్రవాదుల్ని పట్టుకునే అధికారి. తీవ్రవాదంతో మన దేశాన్ని నాశనం చేయాలనుకునే వారిని విజయ్ వర్మ అరెస్ట్ చేయడు. వాళ్లను అప్పటికప్పుడు చంపేయడమే ఈ పాత్ర స్వభావం. ఇంత పవర్‌ఫుల్, వయోలెంట్ పాత్రలో కనిపిస్తాను. అయితే ప్రతిసారి టెర్రరిజం ఆపరేషన్‌కి వెళ్లాక వస్తానో, రానో అని భార్యను అనుమతి అడిగే పాత్ర ఇది. స్నేహం కోసం ప్రాణమిచ్చే పాత్ర ఇది. దేశం గొప్పతనాన్ని తెలిపే పాత్ర ఇది. విదేశాల్లోనూ తీవ్రవాదుల్ని వేటాడి దేశం గర్వించేలా చేసే పాత్రలో ఆద్యంతం నేను మెప్పిస్తాను.
తదుపరి చిత్రాలు…
ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తయింది.
Hero Nagarjuna interview about Wild Dog