అది కేరళ రాష్ట్రం. కేరళలో కుట్టనాడు వ్యవసాయ ప్రధానమైన వనరులు కలిగిన ప్రాంతం. ఇది వరి పంటకు కూడా కేంద్రం. దాదాపు రెండు వందల ఏళ్ల క్రితం వరకు ఈ ప్రాంతం ఒక భయంకరమైన మూఢ నమ్మకానికి ఆలవాలం. గత వారం రోజుల క్రితం కేరళ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో దళితుల, ఆదివాసుల పరిస్థితిని పరిశీలించడానికి వెళ్లినప్పుడు ఒక సంఘటన గురించి తెలుసుకున్నాం.
కుట్టనాడులో అంటే కేరళలోని ఒక ప్రాంతం. ఇది త్రివేండ్రంకు దగ్గరలో ఉంటుంది. ప్రధాన పర్యాటక కేంద్రమైన అలెప్పికి సమీపంలోనే ఈ ప్రాంతం ఉన్నది. దాదాపు రెండు వందల ఏళ్లక్రితం ఈ ప్రాంతంలోని ఒక గ్రామంలో వరదల ద్వారా చెరువు తెగిపోయే ప్రమాదం ఏర్పడింది. కొద్దిపాటి గండి కూడా పడింది. అయితే అక్కడి భూస్వాముల భూములు పూర్తిగా మునిగిపోయి, పొలాలు వరదల పాలయ్యే ప్రమాదం ఏర్పడింది.
అయితే ఆ భూస్వాములు గ్రామంలో ఉన్న జ్యోతిష్యున్ని సంప్రదిస్తే, ఆయన ఒక పరిష్కారం సూచించాడు. చెరువుకు పడిన గండిని పూడ్చే సమయంలో ఒక వ్యక్తిని దేవతలకు బలి ఇవ్వాలని, దానితో దేవతల ఆగ్రహం చల్లారుతుందని ఆయన సూచించాడు. అయితే దానికి ఎవరిని ఎన్నుకోవాలనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. అది అంటరాని కులాలుగా ఉన్న పరయ, పులయలను ఎన్నుకోమని ఆయన సూచన.
భూస్వాములు పనికోసం కూలీలను అంటే ఆ రోజు అంటరాని కులాలుగా వున్న పులయలను పిలిచి పనికి ఆజ్ఞాపించాడు. అయితే అందులో ఒక వ్యక్తిని వాళ్లే ఎంపిక చేసి గండిలో విసిరేసి దాని మీద మట్టి పోయించారు. ఇట్లా ఒక ఊరు కాదు, చాలా ఊళ్లల్లో ఇటువంటి నరబలులకు దళితులు బలైనట్టు అక్కడ నిర్మించిన స్మారక చిహ్నాలు చెప్పకనే చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం పంటల కాలం ప్రారంభమయ్యే సమయంలో ఆ స్మారక స్థలాల దగ్గర పూజలు చేస్తారని స్థానికులు చెప్పారు.
మన తెలంగాణ రాష్ట్రంలో కూడా బతుకమ్మ పండుగ పుట్టుక కూడా ఇటువంటి ఒక సంఘటన జరిగినట్టు మౌఖిక ప్రచారం ఉంది. ఇట్లాగే ఒక చెరువు గండిపడితే ఎంతకు ఆ గండి పూడకపోతే, ఒక యువతి వెళ్లి ఆ గండిలో కూర్చొని, తన మీద కట్ట నిర్మించాలని త్యాగం చేసినట్టు చెబుతుంటారు. కాని ఎవరో ఒకరు కింది కులాల నుంచే ఒక మహిళను నరబలి ఇచ్చి ఉంటారు.
కేరళ రాష్ట్రంలో కుల వ్యవస్థ, దాని అరాచకాలు మిగతా ప్రాంతాల కన్నా చాలా దుర్మార్గంగా ఉండేవని గత చరిత్ర పరిశోధనలు చెబుతున్నాయి.
మహిళలు మీద, వారి అవయవాల మీద వందకు పైగా కన్నులు వేసినట్టు మనం చదివి ఉన్నాం. సినిమాల్లో చూసి ఉన్నాం. బ్రాహ్మణుల్లో కూడా ఎన్నో మూఢనమ్మకాలు ఉండేవి. వాటిని వాళ్లు తొలగించుకోవడానికి నంబూద్రి యోగ క్షేమ సభను ఏర్పాటు చేసుకున్నారు. అట్లాగే శూద్ర కులాలైన వారు, దళిత కులాలు కూడా అటు రాజుల దౌర్జన్యాలకు, ఇటు బ్రాహ్మణ సామాజిక ఆధిపత్యానికి నిలబడి పోరాటాలు చేశారు.
ముఖ్యంగా దళిత కులంలో ఉన్న వెనుకబాటును, వాళ్లు ఎదుర్కొంటున్న కులవివక్షను ఎదుర్కోవడానికి నారాయణ గురు సాగించిన ఉద్యమం ఆ సామాజిక వర్గాన్ని ఎంతో ముందుకు నడిపించింది. అయితే ఆయా కులాల ఉద్యమాలు ప్రధానంగా ఆయా సామాజిక వర్గాల సంక్షేమాన్ని, ప్రగతిని కాంక్షించాయి. అందువల్లనే అంటరాని కులాల సమస్యలను పరిష్కరించడానికి అయ్యన్ కాళి అనే పులియ సామాజిక వర్గానికి చెందిన దళిత యువకుడు సాగించిన ఉద్యమం మరో ప్రవాహంగా ముందుకు వచ్చింది.
అయ్యన్ కాళి త్రివేండ్రంకు సమీపంలోని వెంగనూరులో 1863 ఆగస్టు 28న జన్మించారు. ఆయన తండ్రి పేరు అయ్యన్, తల్లి మాల. ఈయనకు ఎటువంటి చదువు సంధ్యలు లేవు. కాని పులయలు, పరయలు ఎదుర్కొంటున్న దుర్మార్గమైన కుల అణచివేతను, అంటరాని తనాన్ని సహించలేకపోయారు. భారత దేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ సాగించిన సామాజిక విప్లవ పోరాటానికి పునాదులు వేసిన ఉద్యమాల్లో ఇది ఒకటి.
బాబా సాహెబ్ అంబేద్కర్ తన అమెరికా చదువులు ముగించుకొని భారత దేశానికి తిరిగి వచ్చిన అనంతరం 1919లో ఆయన మొదటిసారిగా తన ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అయితే అంతకు ముందుగానే కేరళలో అయ్యన్ కాళి, తమిళనాడులో అయెతీ దాసన్, హైదరాబాద్‌లో భాగ్యరెడ్డి వర్మ, ఉత్తర భారతంలో అచ్యుత్ ఆనంద్‌లు తమ నిరసన, ప్రతిఘటన స్వరాలను వినిపించారు. ఉద్యమాలను నడిపించారు.
అన్నింటికి మించి ఆ రోజుల్లోనే స్వంతంగా పాఠశాలలను నిర్మించారు. అటువంటి యోధులలో ఒకరు అయ్యన్ కాళి ఒకరు. మిగతా వాళ్లందరి కన్నా భిన్నమైన వ్యక్తి, ప్రతిఘటన తరహాలో ఉద్యమం ఆయన ప్రత్యేకత.అప్పటి కేరళలోని గ్రామాల్లో దళితులకు గ్రామాల్లో నడిచే అవకాశమే లేదు. బ్రిటిష్ వాళ్లు ప్రవేశపెట్టిన విద్యాలయాల్లో ప్రవేశమే లేదు. అదే విధంగా వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్న దళితులకు సరైన కూలి లేదు.
సాటి మనుషులతో సమానమైన హక్కులు పక్కన పెడితే, చివరకు సాటి మనుషులుగా చూసే స్థితి గ్రామాల్లో లేదు. అందుకే అయ్యన్ కాళి తన ఉద్యమాన్ని ప్రత్యక్ష సంఘర్షణగానే ఎంచుకున్నారు. నేను ఈ సందర్భంగా వెంగనూరులోని ఆయన నివసించిన గృహాన్ని, ఆయన తన కార్యకలాపాలు కొనసాగించిన ప్రదేశాన్ని చూశాను.
ఆయన స్ఫూర్తి ఇప్పటికీ ఆ యువకులను ఉత్తేజితులను చేస్తూనే ఉంది. ఆయన ప్రారంభించిన మొదటి ప్రతిఘటన ఒక సినిమా దృశ్యాన్ని తలపింప చేస్తున్నది. 1893లో ఎక్కడైతే ఆధిపత్య కులాలు నివసించే ప్రాంతం ఉందో, ఆ ప్రాంతానికి ఎడ్ల బండి మీద బయలుదేరాడు. ఆయనకు ఒక డ్రెస్ కోడ్ ఉంది కేరళ సాంప్రదాయమైన తెల్ల లుంగీ, నల్లని లాల్చి లాంటి పొడుగు చొక్కా కిరీటాన్ని తలపింపజేసే తెల్లని తలపాగా. ఆ వేషధారణలో ఎడ్లబండి మీద బయలుదేరాడు. ఒక దొరలాగా వస్త్రధారణతో ఎడ్లబండి మీద అయ్యన్ కాళి వస్తున్నాడని, ఆధిపత్య కులాలకు చెందిన నాయర్‌లు కూడబలకుకొని, అయ్యన్ కాళిని అడ్డుకోవడానికి నిశ్చయించుకున్నారు.
అడ్డుకున్నారు కూడా అయితే అయ్యన్ కాళి వెనుతిరగలేదు. ఆగిపోలేదు. తన నడుముకు బిగించిన కత్తిని బయటకు తీసి ఎడ్లబండి మీది నుంచి కిందికి దుమికాడు. ఈ సంఘటనను ఊహించని నాయర్‌లు చెల్లాచెదురయ్యారు. ఈ విషయాలను ప్రస్తావించిన కేరళ దళిత కార్యకర్తలు ఆవేశంతో ఊగిపోయారు. ఇది కేరళ దళితుల్లో ఇప్పటికీ ఒక మరవలేని, మరిచిపోని పోరాట దృశ్యం. అయ్యన్ కాళి తన పోరాటాన్ని ఇట్లాగే కొనసాగించారు. తన ఎడ్ల బండి మీద ప్రతి గ్రామం వెళ్లడం, ఆధిపత్య కులాల వాడల్లో నడవడం, ఎవరైతే ఎదిరిస్తే ప్రతిఘటించడం ఇది నిత్య పోరాట రూపం.
ఆయన ఆనాటి ఉద్యమం కోసం 1904 లో సాధుజన పరిపాలన సంఘాన్ని స్థాపించారు. అంటరానితనాన్ని ఎదిరించి పోరాడటంతోపాటు ఈ కులాల్లో విద్యా వ్యాప్తి చేయడానికి ఎంతో కృషిచేశారు. ట్రావెన్‌కోర్ అప్పటి సంస్థానం. అయితే పులయ, పరయలు ఇతర అంటరాని కులాల కోసం పాఠశాలలు ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు అందజేశారు. అప్పటి ట్రావెన్ కోర్ దివాన్ టి. రాజగోపాల చారి 1907లో అంటరాని కులాలకు విద్యను అందించడానికి ఉత్తర్వులు ఇచ్చారు. వెంటనే 1910లో ఆ ఉత్తర్వులు కార్యరూపంలోకి వచ్చాయి.
ఈ ఉత్తర్వుల ప్రకారం, అంటరాని కులాల పిల్లలకు పాఠశాలలో ప్రవేశం కల్పించాలని, ఉరుట్టం బాలం లోని విద్యాలయానికి వెళ్లారు. అయితే ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆ బాలికను చేర్చుకోవడానికి నిరాకరించాడు. అయితే ఈ సంఘటన పులయలకు, నాయర్‌లకు ఘర్షణకు దారి తీసింది. నాయర్‌లు పులయకు చెందిన ఒక ఇల్లును తగులబెట్టారు. ఈ ఘర్షణలు వెంగనూరు చుట్టు ప్రక్కల ప్రాంతాలన్నింటికీ విస్తరించాయి. అంతిమంగా ఆ పాఠశాల కూడా దగ్ధమైపోయింది. దీనిని చరిత్ర రికార్డుల్లో ‘పులియరియట్స్’ అని నమోదు చేశారు.
మల్లెపల్లి లక్ష్మయ్య
దర్పణం