Wednesday, January 22, 2025

పవన్ కళ్యాణ్ గొప్పతనం అదే: ‘బ్రో’ నటి ప్రియా ప్రకాష్ వారియర్

- Advertisement -
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్  కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే,  డైలాగ్స్ అందిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించిన ప్రియా ప్రకాష్ వారియర్, బ్రో సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

- Advertisement -

‘బ్రో’ ప్రాజెక్ట్ లోకి మీరు ఎలా వచ్చారు?
మా అమ్మ సూచనతో నేను అప్పటికే మాతృక వినోదయ సిత్తం చూశాను. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. బ్రో కోసం సముద్రఖని గారు ఫోన్ చేసి లుక్ టెస్ట్ కోసం రమ్మన్నారు. ఆ పాత్ర కోసం ఎందరో పేర్లు పరిశీలించి, చివరికి నన్ను ఎంపిక చేశారు సముద్రఖని గారు. నాలాంటి నూతన నటికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో భాగమయ్యే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. అలాంటి అగ్ర నటులతో ఒకట్రెండు సన్నివేశాల్లో నటించడమే నాలాంటి వారికి గర్వంగా ఉంటుంది.

పవన్ కళ్యాణ్ గారితో కలిసి పని చేయడం ఎలా ఉంది?
కెరీర్ ప్రారంభంలోనే పవన్ కళ్యాణ్ గారి లాంటి లెజెండరీ నటుడితో కలిసి నటించే అవకాశం రావడం ఆశీర్వాదంగా భావిస్తున్నాను. సినిమాలో ఆయన కాంబినేషన్ లో నాకు సన్నివేశాలు ఉన్నాయి. ఆయన తన నటనతో మ్యాజిక్ చేస్తారు. ఆయన సెట్ లో అడుగుపెడితేనే ఏదో అనుభూతి కలుగుతుంది. అది మాటల్లో చెప్పలేము.

మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
గత చిత్రాలతో పోలిస్తే ఇందులో కొత్తగా కనిపిస్తాను. ఇందులో నా పాత్ర పేరు వీణ. హోమ్లీ గర్ల్ లాంటి క్యారెక్టర్. నాకు పవన్ కళ్యాణ్ గారు, సాయి ధరమ్ తేజ్ గారి ఇద్దరితోనూ సినిమాలు సన్నివేశాలు ఉంటాయి.

ఒక్క కన్నుగీటే వీడియోతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత మీ సినిమాల ఎంపికలో తడబాటుకు కారణం?
నాది సినిమా నేపథ్యమున్న కుటుంబం కాదు. నన్ను సరైన మార్గంలో గైడ్ చేసేవాళ్ళు లేరు. ఆ వీడియో తర్వాత అందరూ రకరకాల సలహాలు ఇవ్వడంతో కొన్ని సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాను. ఇప్పుడు ఈ ప్రయాణంలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు పాత్రలు, సినిమాల ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకోగలుతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు గొప్ప నటి కావాలని ఆశ ఉండేది. ఆ దిశగానే నా అడుగులు సాగుతున్నాయి.

మాతృకతో పోలిస్తే బ్రో లో ఎలాంటి మార్పులు చూడొచ్చు?
మాతృకతో పోలిస్తే బ్రో సినిమాలో చాలా మార్పులు చేశారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే భారీతనం ఉంటుంది. అందుకుతగ్గట్టుగానే అవసరమైన మార్పులు ఎన్నో చేశారు. కొన్ని ఆసక్తికరమైన కొత్త సన్నివేశాలు చేర్చారు. ముఖ్య పాత్రల నిడివి పెరిగింది.

పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏం నేర్చుకున్నారు?
పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో నాకు మరీ ఎక్కువ సన్నివేశాలు లేవు. ఆయన చాలా కామ్ గా ఉంటారు. కానీ ఆయన సెట్స్ లో అడుగుపెడితే మాత్రం అందరిలో ఉత్సాహం వస్తుంది. ఆయన ఆస్థాయికి చేరుకున్నా కానీ చాలా జెంటిల్ గా ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది ఆయన నుంచి నేర్చుకున్నాను.

తెలుగు, మలయాళ సినిమాలకు ఎలాంటి వ్యత్యాసం చూశారు?
తెలుగు సినిమాల బడ్జెట్, మార్కెట్ చాలా పెద్దది. కానీ మలయాళంలో ఎక్కువగా కంటెంట్ ఓరియెంటెడ్ లో చిన్న సినిమాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు తెలుగు, మలయాళం అనే తేడా లేకుండా ఇండియన్ సినిమా అంటున్నారు. మన సినిమాలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు భాషతో సంబంధంలేదు.

సముద్రఖని గారి గురించి?
సముద్రఖని గారికి ఆయనకి ఏం కావాలో, నటీనటుల నుంచి ఏం రాబట్టుకోవాలో స్పష్టంగా తెలుసు. దర్శకుడిగా, నటుడిగా ఆయనకీ ఎంతో అనుభవం ఉంది. ఆయన సినిమాలో పని చేయడం నిజంగా ఆనందంగా ఉంది.

కేతిక శర్మ కాంబినేషన్ లో మీ సన్నివేశాలు ఉంటాయా?
ఆ ఉంటాయి. ప్రధాన తారాగణం అందరితోనూ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ఇదొక మంచి కుటుంబ చిత్రం.

సాయి ధరమ్ తేజ్ గురించి?
సాయి ధరమ్ తేజ్ సెట్స్ లో చాలా సరదాగా ఉంటాడు. షూటింగ్ సమయంలో మంచి స్నేహితులయ్యాం. కేతిక, రోహిణి గారు, యువ అందరం సెట్స్ లో అందరం సరదాగా మాట్లాడుకునేవాళ్ళం.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి?
మొదటిసారి ఇంత పెద్ద బ్యానర్ లో సినిమా చేశాను. షూటింగ్ సమయంలో ఎంతో సపోర్ట్ చేశారు. నటీనటుల విషయంలో ఎంతో కేర్ తీసుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News