హైదరాబాద్: హెజ్ బొల్లా అధిపతి హనస్ నస్రల్లా హతమయ్యారు. లెబనాన్ రాజధాని బీరూట్ పై ఇజ్రాయిల్ సైన్యాలు విరుచుకుపడ్డాయి. హెజ్ బొల్లా అధిపతి హనస్ నస్రల్లా మృతి చెందినట్లు ఇజ్రాయిల్ ధృవీకరించింది. ఇజ్రాయిల్ సైన్యం జరిపిన దాడిలో డజన్లలో హెజ్ బొల్లా సైనికులు మృతి చెంది ఉంటారని స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. శుక్రవారం జరిగిన దాడుల్లో ఆరుగురు మృతి చెందగా 91 మంది గాయపడిన విషయం తెలిసిందే.
లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ ప్రాంతంలోని హెజ్‌బొల్లా ప్రధాన స్థావరంపై ఇజ్రాయెల్ సేనలు శుక్రవారం దాడి జరిపాయి. ఓ వైపు ఐరాస వేదికపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రసంగం ముగిసిన దశలోనే ఈ దాడి జరిగింది. తాము బీరూట్ పరిసరాల్లోని హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయం ధ్వంసానికి దిగినట్లు ఇజ్రాయెల్ బలగాలు ప్రకటించాయి. బీరూట్ అంతటా ఈ దాడుల ప్రకంపనలు కన్పించాయి. బాంబులతో భీకరమైన దాడులు చేయడంతో పలు చోట్ల ఆకాశంలో పెద్ద ఎత్తున నల్లటి పొగ అలుముకుంది. ఇరాన్ మద్దతు గల హెజ్‌బొల్లా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్‌ను లక్షంగా చేసుకొని దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ సేనల అధికార ప్రతినిధి డేనియల్ హగరీ తెలిపారు.
లెబనాన్‌లో ఏకకాలంలో పేజర్లు పేలి 12 మంది మృతి చెందగా వేల సంఖ్యలో తీవ్రగాయాలుపాలైన ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ పేలుళ్ల వెనుక ఇజ్రాయిల్ దేశ నిఘా సంస్థ ‘మొస్సాద్’ హస్తం ఉందని లెబనాన్ ఆరోపణలు చేసిన విషయం విధితమే.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నిఘా సంస్థల్లో ఒకటిగా పేరుగాంచిన ఇజ్రాయిల్ నిఘా విభాగం ‘మొస్సాద్’, హెజ్బొల్లా కార్యకలాపాలను పసిగడుతూ కౌంటర్ ఆపరేషన్లు చేపడుతూ వచ్చింది. పెగాసస్ వంటి అత్యంత శక్తివంతమైన నిఘా సాఫ్ట్ వేర్ రూపకర్తలైన ఇజ్రాయిలీ దేశస్థులు సెల్‌ఫోన్లు, ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగించడం తమ కదలికలను పసిగడుతున్నారని ‘హెజ్బొల్లా’ భావించింది. అందుకే కాలం చెల్లిన కమ్యూనికేషన్ వ్యవస్థ ‘పేజర్’ సేవలను మళ్లీ వినియోగంలోకి తీసుకొచ్చింది. సెల్‌ఫోన్లు రాకముందు పేజర్ల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకునేవారు.
కంట్రోల్ సెంటర్ నుంచి ఇచ్చే సందేశం పేజర్లకు చేరుతుంది. తద్వారా మొస్సాద్ కళ్లుగప్పి తమ కార్యాకలాపాలను కొనసాగించవచ్చని హెజ్బొల్లా భావించింది. అయితే ఈ విషయం తెలుసుకున్న మొస్సాద్, వారికి సరఫరా చేసే పేజర్లను మధ్యలోనే తమ చేతుల్లోకి తీసుకుని, ప్రతి పేజర్‌లో అత్యాధునిక పేలుడు పదార్థం PETN (Pentaerythritol tetranitrate)ను అమర్చింది. ప్రతి పేజర్లో బ్యాటరీకి ఆనుకుని అమర్చిన 3 గ్రాముల PETN ఇంతటి విధ్వంసాన్ని సృష్టించింది.
లెబనాన్‌ను వణికించిన ఇటీవలి పేజర్ పేలుళ్లలో రిన్సన్ జోస్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో, దశాబ్దం క్రితం వాయనాడ్‌ను విడిచిపెట్టి నార్వేకు వెళ్లిన 37 ఏళ్ల రిన్సన్ జోస్‌పై కేరళలోని వాయనాడ్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విచారణ ప్రారంభించారు.