హెజ్బొల్లా చీఫ్ లక్షంగా బాంబు దాడులు
విమానంలో అమెరికా వెళుతూ అధికారులతో నెతన్యాహు చర్చలు
సమితిలో ప్రసంగానికి ముందు అనుమతి ఇచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని
టెల్ అవీవ్ : ‘ఆపరేషన్ న్యూ ఆర్డర్’& హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను తుదముట్టించేందుకు ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ అది. నస్రల్లా కదలికలపై నెలల తరబడి నిఘా పెట్టిన ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు సమాచారం సేకరించింది. పక్కాగా ప్లాన్ వేసి బాంబుల వర్షం కురిపించి నస్రల్లాను అంతం చేసింది. ఆ దాడిలో ఇజ్రాయెల్ వాయు సేనకు చెందిన 69వ స్కాడ్రన్ పాల్గొన్నది. హట్‌జెరిమ్ ఎయిర్ బేస్ కేంద్రంగా పని చేసే ఆ స్కాడ్రన్‌ను ‘హామర్స్’ అని కూడా వ్యవహరిస్తారు. ఆ ఆపరేషన్‌లో పొల్గొన్న వారిలో సగం మంది రిజర్విస్టులే, అంటే పూర్తి స్థాయిలో సైనికులు కాదు. ప్రత్యేక సందర్భాలు, ఆపరేషన్లు చేపట్టినప్పుడు ఇజ్రాయెల్ బలగాలు వారిసేవలను ఉపయోగించుకుంటాయి.
తక్కిన సమయాల్లో వారు సాధారణ జీవితం గడుపుతుంటారు. నస్రల్లా కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందుతున్నప్పటికీ ఇజ్రాయెల్ దాడులను వాయిదా వేస్తూ వచ్చింది. నెతన్యాహు మంత్రివర్గంలో కొంత మంది వ్యతిరేకించడమే అందుకు కారణమని తెలుస్తోంది. ‘ఆపరేషన్ న్యూ ఆర్డర్’పై సుదీర్ఘంగా చర్చ జరిగిందని, సోమవారం మొదలైన ఆపరేషన్ వ్యూహం బుధవారంజోరు అందుకుందని సమాచారం. ఐక్యరాజ్య సమితి (యుఎన్) జనరల్ అసెంబ్లీ సమావేశాల నిమిత్తం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన నెతన్యాహు అమెరికా వెళుతూ విమానంలో కూడా దానిపై చర్చలు జరిపారని తెలుస్తోంది. ఇక న్యూయార్క్‌లో జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న నెతన్యాహు సభలో ప్రసంగించే ముందు నస్రల్లాపై బాంబు దాడికి బలగాలకు అనుమతి ఇచ్చారు.
లెబనాన్‌లో నస్రల్లాపై దాడులు చేయడానికి హామర్స్ స్కాడ్రన్ ఎఫ్15 రామ్ ఫైటర్ జెట్‌లను ఉపయోగించింది. ఆ ఆపరేషన్ నేపథ్యంలో హాట్ జెరిమ్ ఎయిర్‌బేస్‌కు కొత్త కమాండింగ్ ఆఫీసర్‌ను నియమించారు. బ్రిగేడియర్ జనరల్ అమిచయ్ లెవనె పర్యవేక్షణలో హామర్స్ స్కాడ్రన్ ఆపరేషన్ న్యూ ఆర్డర్‌ను చేపట్టింది. హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై దాడులకు ఎఫ్15 ఫైటర్ జెట్లు బయలుదేరి వెళ్లాయి. టార్గెట్‌పై సెకనుకు రెండు బాంబులు వంతున 80 బాంబులను జార విడిచాయి. దీనితో క్షణాల్లోనే ఆరు భారీ భవంతులు నేలమట్టమయ్యాయి. అమెరికా సమకూర్చిన బాంబులనే ఆ దాడిలో వాడినట్లు తెలుస్తోంది. అమెరికాలో తయారైన బిఎల్ యు109 బాంబులకు జేడామ్ ప్రిసిషన్ గైడెడ్ కిట్లు అమర్చి దాడి చేశారు. ఆపై సాయంత్రం వేళలో ఫైటర్ జెట్టు హాట్ జెరిమ్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నాయి.