Friday, November 22, 2024

నేటి టెన్త్ పరీక్షకు హై అలర్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గురువారం జరగనున్న పదవ తరగతి పరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొదటి రెండురోజుల పాటు పరీక్ష పేపర్లు వాట్సాప్‌లో బయటకు రావడంతో రెవెన్యూ, పోలీసు శాఖలు పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నాయి. మొదటి రోజు, రెండో రోజు పరీక్ష ప్రారంభమై, పూర్తి కాకముందే ప్రశ్నాపత్రాలు వాట్సాప్‌లో చక్కర్లు కొట్టిన ఘటనలు అధికారులకు కలవరపరుస్తున్నాయి. దాంతో పరీక్షా కేంద్రాల వద్ద మరింత భద్రత పెంచడంతోపాటు పరీక్షల విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లు, సిబ్బంది ఫోన్లు లోపలికి తీసుకెళ్లకుండా పకడ్బంధీగా తనిఖీలు చేపట్టాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

గురువారం జరగనున్న ఇంగ్లీష్ పరీక్షతో పాటు మిగతా పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించాలని దిశానిర్ధేశం చేశారు. పరీక్షల విధుల నిర్వహించే ఇన్విజిలేటర్లు, సిబ్బంది అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశ్నాపత్రాలు బయటకు వచ్చిన ఘటనలో ఇప్పటికే ముగ్గురు ఉపాధ్యాయులను శాశ్వతంగా తొలగించడంతోపాటు కేసులు నమోదు చేశారు. పరీక్షల విధుల్లో అక్రమాలకు పాల్పడే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బందిపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి హెచ్చరించారు.

సెల్‌ఫోన్లపై ప్రత్యేక దృష్టి

పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రెండు రోజులు రోజులు ప్రశ్నాపత్రాలు వాట్సాన్‌లో చక్కర్లు కొట్టిన ఘటనలు కలకలం రేపిన నేపథ్యంలో మిగతా నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న పరీక్షలపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఛీఫ్ సూపరింటెండెంట్ సహా డిపార్మెంట్ అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది ఎవరూ సెల్‌ఫోన్లు వాడకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ మొదటి పరీక్ష రోజు ఇన్విలేజర్ పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్ తీసుకువెళ్లిన నేపథ్యంలో పరీక్షా కేంద్రాలలోకి అనుమతి వెళ్లే ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా పరీక్షించాలని పోలీసు అధికారులు, కలెక్టర్లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. రెండో రోజు కమలాపూర్‌లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో హాల్ టికెట్ లేకుండా బయటి వ్యక్తి పరీక్షా కేంద్రం లోపలికి రావడం, చెట్టు ఎక్కినా గమనించకపోవడంతో పర్యవేక్షణ డొల్లతనం బయటపడింది.

ఈ ఘటనల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకువెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు ఏవిధంగా బయటి వ్యక్తులు పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లకుండా నిఘా పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే పరీక్షా కేంద్రాలలో ఛీఫ్ సూపరింటెండెంట్ ప్రశ్నాపత్రాల సీల్‌ను తెరిచిన తర్వాత కవర్‌లలో డిపార్మెంటల్ అధికారులు ఇన్విజిలేటర్లకు ప్రశ్నాపత్రం అందజేయనున్నారు. ఈ మేరకు అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకోవాలని సూచించారు. పదవ తరగతి పరీక్షలలో అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్య సమన్వయ లోపం కారణంగా పేపర్ లీకేజి వంటి ఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పరీక్షల విధులు నిర్వహించే అందరూ సమన్వయంతో పనిచేసేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.

లోపాలపై దృష్టి

పదో తరగతి పరీక్షల నిర్వహణలో మొదటి రెండు రోజుల్లో ఎదురైన అనుభవాలు, లోపాలను దృష్టిలో ఉంచుకుని పూర్తి స్థాయలో నిఘా పెంచనున్నారు. మొదటి రోజు తాండూరులోని కేంద్రంలో ఇన్విజిలేటర్లు పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్లు తీసుకెళ్లగా తెలుగు ప్రశ్నాపత్రం బయటకు రాగా, రెండో రోజు కమలాపూర్‌లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో హిందీ ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన ఘటనలో లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఇన్విజిలేటర్ల ఫోన్లను సరిగ్గా తనిఖీ చేయలేకపోవడం, హాల్ టికెట్ లేకుండా బయటి వ్యక్తి పరీక్షా కేంద్రం లోపలికి రావడం, చెట్టు ఎక్కినా గమనించకపోవడంతో పర్యవేక్షణ డొల్లతనం బయటపడింది. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం పకడ్బంధీగా తనిఖీలు నిర్వహించి, నిఘా పెంచేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

రెండో రోజూ పేపర్ బయటకి రావడంపై విమర్శలు

తొలిరోజు వికారాబాద్ తెలుగు ప్రశ్నాపత్రం బయటకు వచ్చిత తర్వాత కూడా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మొదటి రోజు తెలుగు ప్రశ్నాపత్రం బయటకి వచ్చినా రెండో రోజు హిందీ పరీక్షకు తగిన జాగ్రత్తలు తీసుకుని నిఘా పెంచడంలో అధికారులు విఫలమయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు, విద్యాశాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల నిర్వహణలో కఠింగా వ్యవహరించాలని ఆదేశించారు. ఒక్కో తహశీల్దార్‌కు కొన్ని పరీక్షా కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్‌డిఒలు కూడా బాధ్యతలు తీసుకుంటారు. ఇంటర్మీడియేట్ పరీక్షలు కూడా పూర్తయినందున టెన్త్ పరీక్షా కేంద్రాల వల్ల పూర్తిస్థాయిలో పోలీసులను మోహరించనున్నారు. ఎస్‌ఐ, సీఐలతో పెట్రోలింగ్ పెంచడంతో పాటు 144 సెక్షన్ను పకడ్బందీగా అమలు చేయనున్నారు.

ముగ్గురు టీచర్లను సర్వీసు నుంచి తొలగింపు

వికారాబాద్ జిల్లా తాండూర్‌లో తెలుగు ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసిన ఇన్విజిలేటర్ బందెప్ప.. దానిని స్వీకరించిన ఉపాధ్యాయుడు సమ్మప్ప ఇద్దరూ అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో పాఠశాల విద్యాశాఖ వారిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించింది. హనుమకొండ కమలాపూర్‌లో పరీక్ష రాస్తున్న విద్యార్థి హిందీ ప్రశ్నాపత్రాన్ని మరో బాలుడు కిటికీ నుంచి తీసుకుని ఫొటో తీసుకున్నా గుర్తించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇన్విజిలేటర్ సబియా మదహత్‌ను సర్వీసు నుంచి తొలగించారు. చీఫ్ సూపరింటెండెంట్ ఎం. శివప్రసాద్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ టి. శ్రీధర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ తెలిపింది. ప్రశ్నాపత్రం ఇచ్చిన విద్యార్థి శివకుమార్‌ను ఐదేళ్లపాటు పరీక్ష రాయకుండా డీబార్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News