Sunday, December 22, 2024

మోడీ ప్రమాణ స్వీకారం వేళ…. ఢిల్లీలో హైఅలర్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయనున్న తరుణంలో అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్ వేదికగా, ఈ కార్యక్రమం జరగనుంది. దాంతో ఆ ప్రాంతమంతా భద్రతను కట్టుదిట్టం చేసినట్టు ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. పారామిలిటరీ బలగాలు, ఎస్‌ఎస్‌జీ కమాండోలు, డ్రోన్లు, స్నైపర్లను మోహరించారు. ఈ కార్యక్రమానికి పొరుగు దేశాలకు చెందిన అధినేతలు రానున్నారు. వారు నిర్దేశించిన మార్గాల్లోనే హోటల్ నుంచి వేదిక వద్దకు వస్తారని అధికారులు తెలిపారు.

ఆ మార్గాల్లో స్నైపర్లు , పోలీస్ సిబ్బంది పహారా కాయనున్నారు. కొన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో డ్రోన్లను మోహరించారు. అలాగే నేతలు బసచేసే హోటళ్లు ఇప్పటికే కట్టుదిట్టమైన రక్షణ వలయంలో ఉన్నాయి. స్కానింగ్ వంటి వాటికోసం కృత్రిమ మేథ సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఇక రాష్ట్రపతి భవన్ లోపల , బయట మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మోడీ సహా ఉన్నత స్థాయి వ్యక్తుల రాకపోకల వేళ.. వేదిక వద్దకు వెళ్లే పలు మార్గాలను మూసివేసే అవకాశాలున్నాయి. ఆదివారం ఉదయం నుంచే ట్రాఫిక్‌ను దారి మళ్లించనున్నారు. అలాగే ఢిల్లీ సరిహద్దుల్లో తనిఖీలను తీవ్రం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన సుమారు 8 వేల మంది అతిథులు హాజరు కానున్నట్టు సమాచారం.

ఢిల్లీ చేరుకున్న షేక్ హసీనా

మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ఒక రోజు ముందుగానే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆమెకు అధికారులు ఘనస్వాగతం పలికారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్‌సింఘే, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు , నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్,భూటాన్ ప్రధాని తోబ్గే తదితర విదేశీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News