తిరువనంతపురం : వైరస్‌ల బెడదతో కేరళ అతలాకుతలం అవుతోంది. కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ నిర్థారణ అయ్యింది. ఇలా గుర్తించడం ఇది రెండోసారి. అలప్పుజ జిల్లాలో బర్డ్‌ఫ్లూ కేసులు కలకలం రేపుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం బాతులు, కోళ్లను చంపాలని నిర్ణయించాయి. మాంసం విక్రయాలపై నిషేధాజ్ఞలు విధించాయి. తకాళి పంచాయితీ పరిధితో పాటు హరిప్పడ్ మునన్సిపాలిటీలోనూ ఈ వైరస్‌ను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ నియంత్రణ కోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశారు.
బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్ని కంటెయిన్‌మెంట్ జోన్లుగా ప్రకటించిన అధికారులు వాహనాలు, ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. సరిహద్దు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో కిలోమీటరు పరిధిలో ఉన్న బాతులు, కోళ్లు, ఇతర పక్షులను చంపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వలస పక్షులకు వైరస్ సోకిందో లేదో నిర్ధారించాలని అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్‌కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా జిల్లాలో బర్డ్ ఫ్లూ నివారణ చర్యలపై రోజువారీ నివేదిక సమర్పించాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించారు.