మక్కా మసీదులో ప్రార్థనలు ప్రశాంతం
చాంద్రాయణగుట్ట: హైదరాబాద్ పాతబస్తీ నివ్వురు గప్పిన నిప్పును తలపించింది. దీంతో పోలీసులు పాతబస్తీ మొత్తంహై అలర్ట్‌ను ప్రకటించారు. ఎక్కడికక్కడ భద్రతా బలగాల సంఖ్యను పెంచడం ద్వారా ఏలా ంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండ పటిష్ట చర్యలు తీసుకున్నారు. గోషమహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదస్పద వ్యాఖ్యలు, ఆయన అరెస్టు, తదనంతర పరిస్థితుల నేపథ్యంలో పోలీసు యంత్రాగం పూర్తిగా అప్రమత్తంగా వ్యవహరించారు. శుక్రవారం ప్రార్థనల సందర్భంగాఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా చర్యలు తీసుకోవడంతో పాతబస్తీలోని చారిత్రక మక్కా మసీదులో మధ్యాహ్నం ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య, నిఘా కళ్ళ నీడలో ఎలాంటి నిరసన ప్రదర్శనలు, నినాదాలు లేకుండా సజావుగా సాగాయి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు పడ్డ శ్రమకు ఫలితం లభించింది. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా టాస్క్ ఫోర్స్ పోలీసులను మోహరించారు.
అంతేకాకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు. ఫలక్‌నుమా, చంద్రాయన్ గుట్ట అలియాబాద్, శాలిబండ, మొగల్‌పురా, హుస్సేన్ అలం, పట్టార్ గడ్డి, మదీనా దారుషిఫా, డబీర్‌పురా, మురిగిచౌక్, మిరాల మండి తదితర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోషామహల్ శాసనసభ్యులు రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీ వ్యాప్తంగా చెలరేగిన నిరసన ప్రదర్శనలతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే రాజా సింగ్‌పై పీడీయాక్ట్ నమోదు చేసి ఆయనను అరెస్టు చేయడం, గురువారం కోర్టులో ఆదేశాల మేరకు చర్లపల్లి కారాగారానికి తరలించారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో చారిత్రక చార్మినార్, గుల్జార్‌హౌస్, పత్తర్‌గట్టి, మదీనా, శాలిబండ, లాడ్‌బజార్ తదితర ప్రాంతాలలోని దుకాణాలను మూసివేశారు. గస్తీ పెంచడంతో పాటు ఆర్‌ఎఎఫ్, సీఆర్‌పీఎఫ్, లా అండ్ ఆర్డర్ పోలీసు బలగాలను మొహరించారు. నగర సీపీ ఆనంద్, దక్షిణ మండల డీసీపీ సాయి చైతన్య తదితర ఉన్నతాధికారులు పాతబస్తీలో పర్యటించి. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు. ప్రార్థనలు ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించిన పాతనగర ప్రజలకు నగర పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్ కృతజ్ఞతలు తెలిపారు.