అహ్మదాబాద్ : అరేబియా సముద్రంలో నెలకొన్న పెనుతుపాన్ బిపర్‌జాయ్ గుజరాత్ తీరప్రాంతాన్ని తాకనుంది. దీనితో గుజరాత్ దక్షిణ, ఉత్తర తీరంవెంబడి పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికారిక వ్యవస్థ సిద్ధం అయింది. ఇప్పటికే 7500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని అధికారులు సోమవారం సాయంత్రం తెలిపారు. సౌరాష్ట్ర కచ్ తీరాల వెంబడి భీకర గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలమవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ చేపలు పట్టేందుకు జాలర్లు సముద్రంలోకి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. వాతావరణ శాఖ సంబంధిత హెచ్చరికలు వెలువరించింది. ఈ నెల 15న గుజరాత్ తీరంలోని మాండ్వీ లేదా పాకిస్థాన్‌కు చెందిన కరాచీ మధ్య ఎక్కడైనా తుపాన్ తీరం దాటుతుంది. దీనితో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి. తుపాన్ ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను గుర్తించి , ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం, వారిని సహాయక కేంద్రాలకు తరలించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.
తుపాన్‌తో ఉధృత గాలులు వీస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. కాగా ఈ తుపాన్ వల్ల తలెత్తే పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం దేశ రాజధానిలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజలను తరలించడం, వారికి తగు ఏర్పాట్లు చేయడం, అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తతతో వ్యవహరించంపై ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు వెలువరించారు. కేంద్రం, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ సంసిద్ధతపై ఆరాతీశారు. ఇప్పటి అంచనాల మేరకు బిపార్‌జోయ్ తుపాన్ గురువారం మధ్యాహ్నం నాటికి కచ్ జిల్లాలోని జఖావూ పోర్టు వద్ద తీరం దాటుతుంది. ఈ తుపాన్‌ను తీవ్రస్థాయి తుపాన్ల కేటగిరిలో చేర్చారు. ఈ తుపాన్ ప్రభావం గుజరాత్‌కు ఎక్కువగా ఉండటంతో కచ్, పొర్‌బందర్, దేవ్‌భూమి ద్వారకా, జామ్‌నగర్, జునాగఢ్, మోర్బీ తీర ప్రాంత జిల్లాల నుంచి ప్రజలను తరలిస్తున్నారు. మత్సకారుల బోట్లను నిలిపివేశారు. 135 145 చివరికి గంటకు 150 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తాయని ,
కుండపోత వానలు పడుతాయని అహ్మదాబాద్ ఐఎండి డైరెక్టర్ మనోరమ మెహంతీ తెలిపారు. కచ్ సౌరాష్ట్ర జిల్లాల్లో తీరానికి పదికిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల నుంచి దాదాపు 23000 మందిప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. దాదాపు 3000 మంది జాలర్లు, రేవులలో పనిచేసే కూలీలను కాండ్లా నుంచి తరలించారు. మాండ్వీలో తీర ప్రాంతంలో వెలిసి ఉన్న పలు మురికివాడల నుంచి బలవంతంగా తాత్కాలిక శిబిరాలకు పంపించారు. ఈ క్రమంలో పలు ఏర్పాట్లు చేపట్టారు. మంగళవారం నాటికి తుపాన్ తాకిడి ప్రాంత ప్రజలందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం పూర్తి అవుతుంది. ప్రధాని మోడీ జరిపిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని , విద్యుత్, టెలికమ్యూనికేషన్స్, ఆరోగ్యం, మంచినీరు వంటివాటికి ఆటంకాలు లేకుండా చూడాలని ప్రధాని తెలిపారు.
ఇప్పటికే సహాయక చర్యల కోసం జాతీయ విపత్తు నిర్వహణ బలగం (ఎన్‌డిఆర్‌ఎఫ్) 12 టీంలను రంగంలోకి దింపి ఉంచింది. బోట్లు, ట్రీకట్టర్స్, సరైన టెలికం పరికరాలతో 15 బృందాలను సిద్ధం చేశారు. తీర ప్రాంతాల వెంబడి ఆరెంజ్ అలర్ట్ వెలువరించారు. రాత్రింబవళ్లు పనిచేసే కంట్రోలురూంలను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని స్థాయిల్లో పూర్తి సమన్వయంతో తుపాన్‌ను ఎదుర్కొవల్సి ఉందని గుజరాత్ అధికార యంత్రాంగానికి ప్రధాని మోడీ ఆదేశాలు వెలువరించారు. మరో వైపు గుజరాత్ తీరం వెంబడి పరిస్థితిని సమీక్షించుకుంటూ సహాయక చర్యలపై దృష్టి పెట్టేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హోం శాఖ అధికారులకు పిలుపు నిచ్చారు.