Monday, January 20, 2025

ముంచుకోస్తున్న మోచా తుపాన్ !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అసలే అకాల వర్షాలు వడగండ్ల వానలతో పంటలను నష్టపోయి విలవిల లాడిపోతున్న రైతాంగం పరిస్థితి మూలిగేనక్కపై తాటి పండు పడ్డ చందంగా తుపాన్ రూపంలో మరో విపత్తు ముంచుకు రాబోతోంది. రాష్ట్రంలో యాసంగి పంట కోతలు మధ్యలో ఉండగానే ఉరుములు మెరుపులతో కూడిన గాలి వాన రైతులను బెంబేలెత్తిస్తోంది. గత పదిరోజులుగా వర్షం కొనసాగుతోంది. వడగండ్ల వానలకు కోతదశో ఉన్న వరి మొక్కజొన్న పైర్లను దెబ్బతీస్తున్నాయి. మామిడి ,నిమ్మ ,నారింజ, పపాయ పండ్లతోటలకు కూడా నష్టం జరుగుతోంది. ఆరబెట్టిన ధాన్యం కల్లాల్లోనే తడిసి ముద్దవుతోంది. ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ బుధవారం నాడు వ్యవసాయరంగానికి పిడుగులాంటి వార్త వెల్లడించింది. వచ్చే వారం తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచివుందని తెలిపింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపాను బలపడే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. మే 6నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మాహపాత్ర మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ మరుసటి రోజు ఆదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమైన మే 9నాటికి తుపానుగా బలపడే అవకాశం ఉంది. ఈ తుపాను ఉత్తర దిశగా కదులుతూ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసిందని డి.జి మహాపాత్ర తెలిపారు. ఈ తుపానుకు మోచా అని పేరు పడుతున్నట్టు ఐఎండి తెలిపింది. యెమన్ దేశంలోని పోర్టు నగరం మోచా పేరుమీదుగా పేరు పెట్టినట్టు తెలిపింది అల్పపీడనం తర్వాత తుపాను దిశ గురించి మరింత ఖచ్చితమైన సమాచారం తెలుస్తుందని ఐఎండి వెల్లడించింది.

వచ్చే వారం ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 40నుండి50కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. సాధారణంగా రుతుపవనాలకు ముందు ఏప్రిల్ మే జూన్ సీజన్‌లో బంగాళాఖాతంలో తరుచూ తుపానులు ఏర్పడుతుంటాయి. మేలో వీటి ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వివరించింది. దేశంలో అక్టోబర్‌డిసెంబర్ మధ్య తిరోగమన రుతుపవనాల ప్రభావంతో మరో తుపాను సీజన్ ఉంటుంది. వీటికితోడు పశ్చిమ ఆరేబియా సమద్రంలో కూడా తుపానులు ఏర్పడుతుంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఒడిశా ఏపి ప్రభుత్వాలు అలర్ట్ !
బంగాళాఖాతంలో అల్పపీడనాలు వాయుగుండాలు తుపాన్‌లు పొంచి ఉన్నట్టు భారత వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో ఒడిశా ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఒడిశా ముఖ్యమంత్రి నీవన్‌పట్నాయక్ అత్యవసర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పరిస్థితులు సమీక్షించారు.తీర ప్రాంత ప్రజలను ప్రజలను కాపాడేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని అదేశాలిచ్చారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ ,అగ్నిమాపక శాఖ ,ఓడ్రాప్ బృందాలను సిద్దం చేసి 18 జిల్లాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలని , మంచినీరు , ఆహారం తదితర వాటిని సిద్దం చేయాలని సిఎం ఆదేశాలిచ్చారు. ఏపిలో కూడా తుపాన్ ప్రభావంపై అంచనాలు వేస్తు అధికారులను జగన్ సర్కారు అప్రమత్తం చేస్తోంది.
వేసవి తుపాన్ కదలికలు అంచనావేయలేం:
వేసవిలో ఏర్పడే తుపాన్ కదలికలను ముందుగా అంచనావేయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడే మోచా తుపాను ప్రభావం తెలంగాణ రాష్ట్రంపైన ఏమేరకు ప్రభావం చూపుతుందన్నదానిపై ఇప్పుడే చెప్పలేమంటున్నారు. అయితే తుపాను ప్రభావం వలన తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి మరఠ్వాడ ,ఇంటిరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ స్థిరంగా ఉండి సగటు సముద్రమట్టం 1.5 కి.మి ఎత్తు వరకు ద్రోణి కొనసాగుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలో ఉరుములు ,మెరుపులు ,ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.
కొత్తగూడెం జిల్లాలో 66.2 మి.మి వర్షం
రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో పలు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా భదాద్రి కొత్తగూడెం జిల్లా మలకలపల్లిలో 66.2మి.మి వర్షం కురిసింది. అశ్వారావు పేటలో 41.4, పెబ్బేర్‌లో 35.2, పాల్వంచలో 29, బోధ్‌లో 25.4, కొణిజర్లలో 20.2, వీపనగండ్లలో 18.4, మానోపాడ్‌లో 17.8, గంభీరావుపేటలో 16.4, అదిలాబాద్‌లో 15.2, మధిరలో 15.2, రామాయంపేటలో 12, మఠంపల్లిలో 11.4, మోతేలో 10.4 తామ్సిలో 10మి.మి వర్షం కురిసింది. మిగిలిన మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి జల్లులు పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News