హైదరాబాద్: అధిక రక్త పోటు (blood pressure) అంటే చాలా మంది రోగ లక్షణంగా భయపడుతుంటారు. కానీ రక్తపోటు వాస్తవానికి రోగం కాదు. ఎవరికైనా ఆరోగ్య పరిస్థితిని సంక్షిప్తంగా వివరించడానికి వైద్యులు నాలుగు లక్షణాలపై ఆధారపడుతుంటారు. అవి శరీర ఉష్ణోగ్రత (body temperature),నాడీ లేదా హృదయ స్పందన జోరు (pulse or heart rate), ఊపిరి జోరు (respiration rate ), రక్తపోటు ( blood pressure).ఈ నాలుగు లక్షణాలు తమ సహజ స్థాయి మించి పెరిగినా, తగ్గినా ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. రక్తపోటు సహజ స్థాయి దాటి పెరిగితే దానిని అధిక రక్తపోటు ( high blood pressure or hypertension ) అంటారు.
ఇది రోగ లక్షణం. రక్తపోటు ఎక్కువగా ఉన్నవారికి బయటికి ఏ లక్షణాలు కనిపించవు. చాపకింద నీరులా శరీరానికి హాని కలిగించే సమయంలో బయటపడుతుంది. భారత్ లోని బీపీ (రక్తపీడనం) రోగుల్లో 75 శాతం మందికి పైగా వారి రక్తపోటుపై నియంత్రణ లేదని, ఈ రోగుల్లో కేవలం నాలుగోవంతు కంటే తక్కువ మందిలో మాత్రమే రక్తపోటు అదుపులో ఉందని ఒక అధ్యయనం వెల్లడించింది. దాదాపు 13 లక్షల మంది బీపీ రోగులపై అధ్యయనం చేయగా, సగం మందికి కూడా వారి బిపి నియంత్రణ గురించి అవగాహన లేదని తేలింది. హృదయ సంబంధిత వ్యాధులతోపాటు ఇతర రకరకాల అనారోగ్య సమస్యలకు రక్తపోటే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు.
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (న్యూఢిల్లీ), బోస్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (అమెరికా) పరిశోధకులు 2001 2020 మధ్యకాలంలో వెలువడిన 51 అధ్యయనాలను పరిశీలించారు. ఇందులో 21 పరిశోధన పత్రాల బట్టి పురుషుల కంటే మహిళల్లో తక్కువ రక్తపోటు నియంత్రణ రేటు ఉన్నట్టు కనుగొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని బీపీ రోగుల్లో వారి నియంత్రణ రేటు తక్కువగా ఉన్నట్టు 6 పరిశోధన పత్రాల ద్వారా తెలిసింది. 20012020 మధ్యకాలంలో దేశంలో రక్తపోటు నియంత్రణ రేటు 17.5 శాతం ఉండగా, 30162020 మధ్య గణనీయంగా పెరిగి, 22.5 శాతానికి చేరుకుందని వెల్లడైంది. ఉత్తరభారతంతో పోల్చితే దక్షిణ , పశ్చిమ భారత్‌లో బీపీ రోగులే ఎక్కువ రక్తపోటు నియంత్రణ రేటు కలిగి ఉన్నట్టు తేలింది.
మహిళలతో పోల్చితే కొద్ది మంది పురుషుల్లోనే వారి రక్తపోటు అదుపులో ఉందని నిర్ధారణ అయింది. గతంతో పోల్చితే 2016 2020 మధ్య కాలంలో బీపీ నియంత్రణ పెరిగినప్పటికీ, ప్రాంతాల వారీగా చాలా తేడాలు కనిపిస్తున్నాయి. బీపీని స్ఫిగ్మో మానోమీటర్ ( sphygmomanometer) అనే పరికరంతో, మెర్కురీ మిల్లీ మీటర్లలో ( mmhg) కొలుస్తారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల రక్తపోటు 120/80 ఉంటుంది. ఈ విలువ 135/85 దాటితే ఆ వ్యక్తి అధిక రక్తపోటు లేదా హైబీపీతో బాధపడుతున్నట్టు లెక్క. దీంతో పోల్చితే బీపీ రోగుల్లో రక్తపోటు చాలా అధికంగా ఉందని ఈ అధ్యయనం వెల్లడించింది. అధ్యయనం చేసిన వారిలో 46.8 శాతం మందికి మాత్రమే వారి బీపీ గురించి అవగాహన ఉందని వెల్లడైంది. భారత దేశంలో అత్యధిక బీపీ వల్ల పెరుగుతున్న మరణాలను తగ్గించాలంటే దీనిపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.