హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. తెలంగాణ బిజెపిపై పార్టీ అగ్రనేతలు దృష్టి పెట్టారు. పార్టీలోని తాజా పరిణామాలపై కేంద్ర మంత్రి అమిత్ షా, జెపి నడ్డా ఆరా తీశారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచి బిజెపిలో చేరిన ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈటల, రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు సీనియర్లు ఇటీవల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో బిజెపి అగ్రనేతలు రంగంలోకి దిగారు.
Also Read: రాజ్‌నాథ్ సింగ్‌తో కెటిఆర్ భేటీ: రక్షణ భూములు బదిలీకి విజ్ఞప్తి
అసంతృప్తి నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు. బిజెపి ముఖ్యనేతలు నేడు లేదా రేపు ఢిల్లీ పయనం కానున్నారు. అయితే, రానున్న ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ఫోకస్ చేసింది. కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిపోయిన నేతలను పార్టీలోకి చేరాలని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బిఆర్ఎస్, బిజెపికి చెందిన పలువురు నేతలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి రేవంత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.