గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ ల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకూ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎంపిక చేసిన దాసోజు శ్రవణ్, సత్యనారాయణల పేర్లను గవర్నర్ తమిళి సై తిరస్కరించారు. దీనిపై అభ్యర్థులిద్దరూ కోర్టుకు వెళ్లారు. తమ కేసు విషయంలో స్పష్టత వచ్చేంతవరకూ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేసిన కోదండరామ్, అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని శ్రవణ్, సత్యనారాయణ కోర్టును కోరారు.
అయితే గత ప్రభుత్వంలో మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని కొత్తప్రభుత్వం రద్దు చేసిందని గవర్నర్ కార్యదర్శి తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు స్టేటస్ కో విధించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది.