Thursday, November 14, 2024

గుజరాత్ మత చట్టానికి హైకోర్టు బ్రేక్‌లు

- Advertisement -
- Advertisement -

High Court breaks Gujarat Religion Act

కొన్ని సెక్షన్ల అమలుపై స్టే జారీ
పౌరుల వేధింపుల నివారణకు: ధర్మాసనం
పెళ్లి ముసుగులో మత మార్పిడికి కళ్లెం: ప్రభుత్వం
జమాయిత్ వ్యాజ్యంపై వాదోపవాదాలు

అహ్మదాబాద్: మతమార్పిళ్ల కొత్త చట్టంపై గుజరాత్ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి గురువారం షాక్ తగిలింది. మతాంతర వివాహాలకు సంబంధించి ఈ చట్టంలో ఉన్న కొన్ని సెక్షన్లను గుజరాత్ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. గుజరాత్‌లో ఫ్రీడం ఆఫ్ రిలిజియన్ (సవరణ) చట్టం 2021ను తీసుకువచ్చారు. అయితే ఈ చట్టంలోని పలు నిబంధనల అమలుపై స్టే విధిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి విక్రమ్ నాథ్, జస్టిస్ బిరెన్ వైష్ణవ్‌తో కూడిన ధర్మాసనం స్టే మంజూరు చేస్తున్నట్లు, ప్రజలను అనవసరమైన వేధింపుల బారి నుంచి రక్షించేందుకు ఈ విధమైన చర్యకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. గుజరాత్‌లో మత మార్పిడుల చట్టానికి ఈ ఏడాది సవరణలు చేశారు. ఈ క్రమంలోనే కొత్త చట్టం అమలులోకి వచ్చింది.

దీని మేరకు పెళ్లిళ్లు చేసుకోవడం ద్వారా ఉద్ధేశపూర్వక లేదా బలవంతపు వివాహాలకు దిగడాన్ని నిరోధించే పలు కటుతర నిబంధనలను ఇందులో పొందుపర్చారు. చట్టాన్ని జూన్ 15వ తేదీ నోటిఫికేషన్ ద్వారా అమలులోకి తెచ్చారు. మతాంతర వివాహాల ద్వారా మత మార్పిడులకు దిగుతున్నారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని , ఈ సరికొత్త చట్టాన్ని తీసుకువచ్చినట్లు ప్రభుత్వం సమర్థించుకుంది. దీనికి సంబంధించి తాత్కాలిక ఆదేశాలను చీఫ్ జస్టిస్ విక్రమ్‌నాథ్ వెలువరిస్తూ ఈ కేసుకు సంబంధించి విచారణను పెండింగ్ పెడుతూ ప్రస్తుతానికి ఈ చట్టంలోని 3,4ఎ నుంచి 6 ఎ వరకూ ఉన్న సెక్షన్లను అందులోని కటుతర అంశాల అమలును నిలిపివేస్తున్నట్లు తెలిపారు. మతాంతర వివాహం జరిగినప్పటికీ ఇందులో బలవంతం, ప్రోద్బలాలు, లేదా తప్పుడు పద్ధతులు వంటివి లేకపోతే వాటిని నిరోధించాల్సిన అవసరం ఉందా? అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ సెక్షన్ల అమలును తాత్కాలికంగా నిలిపివేసినట్లు వివరించారు.

సక్రమంగా ఆమోదయోగ్యంగా ఉండి జరిగే వివాహాలను చట్టవ్యతిరేక మతమార్పిడులకు జరిగే ప్రక్రియలుగా భావించడం భావ్యం కాదని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. మతాంతర వివాహాలు చేసుకునే వారికి ఉండే చట్టపరమైన రక్షణను కాపాడటం బాధ్యతగా భావించి ఈ ఆదేశాలు వెలువరిస్తున్నట్లు చెప్పారు. గుజరాత్‌కు చెందిన జమాయిత్ ఉలేమా ఏ హింద్ ఈ చట్టంలోని నిబంధనలను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. అంతకు ముందు దీనిపై జరిగిన విచారణలో రాష్ట్రం తరఫున అడ్వకేట్ జనరల్ కమల్ త్రివేది వాదన విన్పించారు. రాష్ట్రంలోని మతాంతర వివాహాలపై నిషేధం ఏదీ లేదన్నారు. అయితే బలవంతపు మత మార్పిడులను ఈ పెళ్ళిళ్ల ముసుగులో జరిపితే వ్యతిరేకించాల్సి ఉంటుంది.

అందుకే ఈ చట్టం తీసుకువచ్చినట్లు సమర్ధించుకున్నారు. చట్టంలోని నిబంధనల గురించి ఎందుకు భయాలు అని, చట్టబద్ధమైన మతమార్పిడి జరిగితే ఎవరూ భయపడాల్సిన పనిలేదని, అయితే పద్ధతి వీడి జరిగే వాటిపై చర్యలు ఉంటాయనేదే సెక్షన్లలోని అంశం అని స్పష్టం చేశారు. పిటిషనర్లు తమ వాదనలో ఈ చట్టంలోని అంశాలు రాజ్యాంగంలో ప్రసాదించిన హక్కులకు విఘాతంగా ఉన్నాయని అన్నారు. వివాహాల మౌలిక సూత్రాలు, మత ప్రచారం, ఆచరణ, మత పద్ధతుల పాటింపులకు భిన్నంగా చట్టాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News