మనతెలంగాణ/హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రాదని, ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందంటూ హైకోర్టులో రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించకుండానే మంగళవారం నాడు హైకోర్టు కొట్టి వేసింది. గతంలో ఎసిబి కోర్టులో ఇదే పిటిషన్ రేవంత్‌రెడ్డి దాఖలు చేయగా అక్కడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 2015లో జరిగిన తెలంగాణ ఎంఎల్‌సి ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్‌సన్‌కు ప్రలోభపెట్టేందుకు టిడిపి పార్టీ తరఫున రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తూ కెమెరాకు అడ్డంగా దొరికి పోయారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ నడుస్తోంది. ఇటీవలే ఈ కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసింది. కాగా ఓటుకు నోటు కేసు ఎసిబి పరిధిలోకి రాదని ఈ కేసు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని రేవంత్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో ఎసిబి కోర్టు కొట్టివేయడంతో రేవంత్ తిరిగి హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు పిటిషన్‌ను విచారించకుండానే కొట్టేసింది.