హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపి వైఎస్ అవినాశ్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వచ్చే బుధవారం వరకు(జూన్ 1) అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సిబిఐని హైకోర్టు శనివారం ఆదేశించింది. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం లక్ష్మణ్ శనివారం మధ్యంతర తీర్పు వెలువరించారు.
బుధవారం తుది తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి తెలిపారు. తనపై సిబిఐ ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని అవినాశ్ రెడ్డి హైకోర్టును తన పిటిషన్‌లో అభ్యర్థించగా తల్లి అనారోగ్యం కారణంగా అవినాశ్ రెడ్డిని బుధవారం వరకు అరెస్టు చేయవద్దని సిబిఐని న్యాయమూర్తి ఆదేశించారు. అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాది, ఈ కేసులో ఇంప్టీడ్ అయిన వైఎస్ వివేకానందరె రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత తరఫు న్యాయవాది శుక్రవారం తమ వాదనలు వినిపించగా శనివారం ఉదయం సిబిఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనల అనంతరం న్యాయమూర్తి తీర్పును బుధవారం రిజర్వ్ చేశారు.