Monday, January 20, 2025

గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్

- Advertisement -
- Advertisement -

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల రద్దుపై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఎలాంటి బలమైన కారణం కనిపించడం లేదని, మొయిన్స్ పరీక్షలు నిర్వహించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, ప్రిలిమ్స్ పరీక్షల్లో ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని, ఎస్‌టి రిజర్వేషన్ చెల్లదని 10 మంది అభ్యర్థులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను మంగళవారం విచారించిన ధర్మాసనం ఇప్పటికే కొన్ని పిటిషన్లను కొట్టివేసింది. తాజాగా మంగళవారం గత రెండు పిటిషన్లను కొట్టివేస్తూ ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లు ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది. ఈ నెల 21 నుంచి మెయిన్స్ పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ తీర్పుతో ప్రిలిమ్స్ ఉత్తీర్ణులై మెయిన్స్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో ఆనందం నెలకొంది. ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో గ్రూప్-1 పరీక్షకు అడ్డంకి తొలగిపోయింది. మరో ఆరు రోజుల్లో గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 నుంచి గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు టిజిపిఎస్‌సి ఏర్పాట్లు చేసింది. 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాయనున్నారు.

అందుబాటులోకి హాట్ టికెట్లు
మరోవైపు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు ఈ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 21 నుంచి 27వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలను హెచ్‌ఎండిఎ పరిధిలో నిర్వహిస్తున్నారు. హాల్‌టికెట్లు పరీక్ష ప్రారంభమయ్యే ఒక రోజు ముందు వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. మెయిన్స్ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందుగా పరీక్ష హాల్‌లోకి చేరుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు అభ్యర్థులను అనుమతించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత వచ్చే వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. మెయిన్స్‌లో భాగంగా ప్రతి అభ్యర్థి ఆరు పేపర్లకు సంబంధించి పరీక్షలు రాయాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News