ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పాదయాత్రకు న్యాయస్థానం అనుమతిచ్చింది. ఈ మేరకు బండి సంజయ్‌కి ఎసిపి ఇచ్చిన నోటీసును హైకోర్టు సస్పెండ్ చేసింది. కాగా, ప్రజా సంగ్రామ యాత్రపై వర్ధన్నపేట ఎసిపి ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ బిజెపి నేతలు ఈ నెల 23న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. అనంతరం విచారణను గురువారం ఉదయానికి వాయిదా వేసింది.
అయితే ఈ పిటిషన్‌ను విచారణ చేసిన జస్టిస్ లలితకుమారి సెలవులో ఉండడంతో ఈ పిటిషన్ జస్టిస్ వినోద్ కుమార్ బెంచికి మారింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విషయమై ఆందోళన చేసిన బిజెపి శ్రేణులపై హైదరాబాద్ పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్రలో బస చేసిన చోటునే బండి సంజయ్ దీక్షకు ప్రయత్నించారు. దీంతో నెల 23న బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ఆయన ఇంటికి తరలించారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని వర్ధన్నపేట ఎసిపి బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేశారు.