Friday, December 20, 2024

తొందరెందుకు?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సిబిఐ ఢిల్లీ విభాగానికి హైకోర్టు అప్పగించింది. దీనిపై దర్యాప్తు చేయాలని సిబిఐ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఈ క్రమంలోనే సిబిఐ ఢిల్లీ ఎస్‌పి నేతృత్వంలోని బృందం హైదరాబాద్‌కు వచ్చింది. సిట్ నుంచి కేసు పత్రాలు ఇవ్వాలని సిఎస్‌కు సిబిఐ లేఖ రాసింది. అయితే సోమవారం వరకు కేసు ఫైళ్ల కోసం ఒత్తిడి చేయవద్దని సిబిఐకి హైకోర్టు తెలిపింది. ప్రభుత్వ అప్పీలుపై సోమవారం స్పష్టత వచ్చాక.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సిబిఐ భావిస్తోంది. ఇదిలావుండగా ఎంఎల్‌ఎల కొనుగోలు కేసును సిబిఐకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్ట్ సోమవారానికి వాయిదా వేసింది. కేసు విచారణ సందర్భంగా హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా బిజెపి తరపున లాయర్ దామోదర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బిజెపి ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చలేదని, ఏ ఎంఎల్‌ఎను కొనుగోలు చేయలేదని ఆయన తెలిపారు. 2014 నుంచి 37 మంది ఎంఎల్‌ఎలను బిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇతర పార్టీల ఎంఎల్‌ఎలు బిఆర్‌ఎస్‌లో చేరాలని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారని వాదించారు. విచారణ సందర్భంగా ఇరు పక్షాల న్యాయవాదులు ప్రస్తావించిన అంశాలపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం. బిజెపి, బిఆర్‌ఎస్ అంశాలు బయటే చూసుకోవాలని వ్యాఖ్యానించింది. ఇకపోతే ఎంఎల్‌ఎల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ జడ్జి తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు పభుత్వ వాదనలు విన్నది. రాష్ట్ర ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.

ప్రభుత్వ ఎంఎల్‌ఎలను కొనాలని చూసినప్పుడు పార్టీ అధ్య క్షుడిగా కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టడంలో తప్పేంటని ఆయన కోర్టుకు వివరించారు. కోర్టుకు నివేదిక అందజేసిన తర్వాత అది పబ్లిక్ డొమైన్‌లోకి వస్తుందని, ప్రజాక్షేత్రంలోకి ఎవిడెన్స్ వచ్చిన తర్వాతనే కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు తెలిపారని దవే వాదనలు వినిపించారు. అయితే ప్రతి వాదుల తరపు వాదనలు సోమవారం కొనసాగాయి. సిబిఐ తరపు న్యాయ వాదులు వాదిస్తూ కేసు వివరాలన్నీ ఇవ్వాలని తెలంగాణ ప్రభు త్వానికి లేఖ రాశామని హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా మాకెలాంటి డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని తెలిపారు. డాక్యుమెంట్లు ఇస్తేనే విచారణ మొదలెడతామని సిబిఐ తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు. దీంతో జోక్యం చేసుకున్న న్యాయస్థానం.. డివిజన్ బెంచ్‌లో విచారణ పూర్తయ్యే వరకు ఆగాలని సిబిఐని ఆదేశించింది. సీబీఐ వాదన కూడా వింటామన్న కోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News