Saturday, January 18, 2025

అమరావతే

- Advertisement -
- Advertisement -

High Court orders Andhra Pradesh govt to implement CRDA Act

సిఆర్‌డిఎ చట్టాన్ని అమలుపర్చాల్సిందే
రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాల్సిందే

ఆరుమాసాల్లో మాస్ట్టర్ ప్లాన్ పూర్తి చేయాలి
రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదు : ఎపి హైకోర్టు కీలక తీర్పు, అమరావతి ఉద్యమకారుల హర్షాతిరేకం

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు, సిఆర్‌డిఎ రద్దు పిటిషన్లపై గురువారం నాడు ఎపి హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. సిఆర్‌డిఎ చట్టం ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్లాలని, రైతులతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని పేర్కొనడంతో పాటు అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకి నివేదిక ఇవ్వాలని తీర్పులో సూచించింది. భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని, రాజధాని అవసరాలకు తప్ప ఇతరత్రా వాటికి ఆ భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించొద్దని స్పష్టం చేసింది.

అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని ఆదేశించింది. మూడు నెలల్లోపు వాటాదారులకు ప్లాట్లు నిర్ణయించడంతో పాటు ఆరునెలల్లోపు ప్లాట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని తేల్చిచెప్పింది. మాస్టర్ ప్లాన్లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలని, రాజధానిపై ఎలాం టి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని తెలిపింది. అలాగే పిటిషనర్లందరికీ ఖర్చుల కింద రూ.50వేలు చెల్లించాలని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూలింగ్ భూములను ఇతర అవసరాలకు తనఖా పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.రిట్ ఆఫ్ మాండమస్ నిరంతరం కొనసాగుతుందని తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు రిట్ ఆఫ్ మాండమస్ కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లకుండా ప్రజల ఆకాంక్షను గౌరవించాలని న్యాయవాదులు సూచించారు.

హైకోర్టుకు రైతుల సాష్టాంగ నమస్కారం

అమరావతి తీర్పుపై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేయడంతో పాటు హైకోర్టు బయట న్యాయస్థానానికి సాష్టాంగ నమస్కారం చేశారు. అలాగే అమరావతి రైతులు రహదారిపై కీలోమీటరు మేరకు బారులు తీరి న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు. హైకోర్టు ముందు అటు మహిళా రైతులు సైతం కీలోమీటర్ వరకు నిలబడి తీర్పుపై కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అమరావతికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రజల గొప్ప విజయంగా భావించాలని న్యాయవాది సుంక రాజేంద్రప్రసాద్ అన్నారు. రైతులకు చేసిన వాగ్దానాలను అమలు చేయాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. సుప్రీంకోర్టు ఇందులో జోక్యం చేసుకుంటుందని మేం అనుకోవట్లేదని ఆయన అన్నారు. అమరావతిపై హైకోర్టు తీర్పు పట్ల న్యాయవాది నర్రా శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. త్రిసభ్య ధర్మాసనం 75 కేసుల్లో వేర్వేరుగా తీర్పులిచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసన వ్యవస్థకు 3 రాజధానుల చట్టం చేసే అధికారం లేదని హైకోర్టు చెప్పిందన్నారు.

కోర్టు తీర్పుపై సర్కారు సమీక్ష

రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులు హాజరయ్యారు. అమరావతి, మూడు రాజధానుల కేసులో హైకోర్టు తీర్పు కాపీలోని అంశాలపై చర్చించారు. హైకోర్టు తీర్పు దృష్ట్యా రాజధానిపై చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై సిఎం చర్చించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై సమాలోచనలు చేశారు. సుప్రీంకోర్టుకు వెళితే ఎలా ఉంటుంది. వెళ్లకపోతే ఏం చేయాలనే అంశాలపైనా నేతలు, న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకున్నారు. అనతికాలంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజధానిపై ప్రభుత్వ విధానాన్ని, భవిష్యత్ కార్యాచరణను ప్రజలకు స్పష్టం చేయాలని సిఎం జగన్ మంత్రులకు ఆదేశాలిచ్చారు.

వాటికే కట్టుబడి ఉన్నాం : మంత్రి బొత్స

ఎపిలో మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమన్నారు. తమ విధానానికి నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అడ్డంకులు తొలగించుకుని అందరికీ ఆమోదయోగ్యంగా బిల్లు తెస్తామని తెలిపారు. రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన సమీక్షలో మంత్రి బొత్స పాల్గొన్నారు. సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా అనే అంశంపై చర్చిస్తామన్నారు. రాజధాని అంటే కేవలం భూమి, అక్కడి సామాజిక వర్గమే కాదని అన్నారు. ఇతర ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఏదైనా సమాఖ్య వ్యవస్థకు లోబడి ఉండాలని బొత్స వెల్లడించారు.

ప్రజలే కాపాడుకున్నారు : చంద్రబాబు

అమరావతి ప్రజలు ప్రపంచంలోనే అత్యధిక భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చారని, వారే ప్రజా రాజధానికి కాపాడుకున్నారని మాజీ సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎలాంటి వివాదం లేకుండా 33 వేల ఎకరాల భూమి ఇచ్చారన్నారు. తాను ముందుచూపుతో పకడ్బందీగా సిఆర్‌డిఎ చట్టాన్ని తీసుకువచ్చానని, రాజధాని విషయంలో వైకాపా నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని చంద్రబాబు మండిపడ్డారు. మీ రాజధాని ఏదని అడిగితే మన పిల్లలు చెప్పుకునే పరిస్థితి లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్ట్ ఇచ్చిన తీర్పును బిజెపి స్వాగతిస్తుందని కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి తెలిపారు. అమరావతి రాజధానికి బిజెపి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎపిలో మూడు రాజధానులు, సిఆర్‌డిఎ రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పును సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ స్వాగతించారు.రాష్ట్ర సర్కార్ ఇకనైనా రాజధాని అభివృద్దిపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News