కోల్‌కత: ఆరు నెలల క్రితం తన స్వరాష్ట్రం అస్సాంలో ఖననం చేసిన ఐఐటి ఖరగ్‌పూర్ విద్యార్థి ఫైజన్ అహ్మద్ మృతదేహాన్ని వెలికితీసి రెండవసారి పోస్టు మార్టం నిర్వహించాలని కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశించింది. విద్యార్థి ఫైజన్ మరణం వెనుక ఉన్న వాస్తవాలను వెలుగులోకి తీసుకురావలసిన అవసరం ఉందని హకోర్టు తెలిపింది. ఐఐటి ఖరగ్‌పూర్‌లో మూడవ సంవత్సరం చదువుతున్న తన కుమారుడి మరణాన్ని దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్)ను ఏర్పాటుచేయాలని కోరుతూ ఫైజన్ అహ్మద్ తండ్రి కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ్ మిడ్నాపూర్ జిల్లాలోగల ఐఐటి ఖరగ్‌పూర్‌కు చెందిన తన హాస్టల్ రూములో 2022 అక్టోబర్ 14న ఫైజన్ మృతదేహం లభించింది.
Also Read: సమంతకు గుడి.. ఎక్కడో తెలుసా?
ఫైజన్ అహ్మద్ మరణం వెనుక గల వాస్తవాలను వెలుగులోకి తీసుకురావలసిన అవసరం ఉందని, అతని మృతదేహాన్ని వెలికితీసి మరోసారి పోస్టు మార్టం నిర్వహించాలని కలకత్తా హైకోర్టుకు చెందిన జస్టిస్ రాజశేకర్ మంతా ఆదేశాలు జారీచేశారు. అస్సాంలోని టింకుసియాకు చెందిన ఫైజన్ అహ్మదవ్ మెకానికల్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నారు. అతని మృతదేహాన్ని వెలికితీసిన తర్వాత కోల్‌కతాలోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో రెండవసారి పోస్టుమార్టం నిర్వహించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
Also Read: 40 మంది భార్యలకు భర్త ఒక్కడే కానీ…
మృతదేహం వెలికితీత విషయంలో అస్సాం పోలీసులతో సమన్వయం చేసుకోవాలని దర్యాప్తు అధికారిని న్యాయమూర్తి ఆదేశించారు. పశ్చిమ బెంగాల్ పోలీసులు ఫైజన్ మృతదేహాన్ని కోల్‌కతాకు తీసుకురావాలని ఆయన చెప్పారు. పోస్టు మార్టం నిర్వహించే బాధ్యతను ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ అజయ్ కుమార్ గుప్తాకు న్యాయస్థానం అప్పగించింది. ఫైజన్‌కు ఇదివరకు పోస్టు మారం నిర్వహించిన డాక్టర్ల సమక్షంలో రెండవ పోస్టుమార్టం నిర్వహించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను జూన్ 13వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. తన ఆదేశాలను నెలరోజుల్లో పూర్తిచేయాలని కూడా ఆయన ఆదేశించారు.