Monday, January 20, 2025

ఆపండి

- Advertisement -
- Advertisement -

సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై యాజమాన్యం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. కూల్చివేతలు ఆపేయాలంటూ ఎన్ కన్వెన్షన్ మేనేజర్ ప్రదీప్ రెడ్డి హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు, నీటి పారుదల ముఖ్య కార్యదర్శి, జిహెచ్‌ఎంసి కమిషనర్, హైడ్రా సహా ఏడుగురిని ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై జస్టిస్ టీ వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పి.శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేశారని, ఒక్కోసారి 200మంది పోలీసులు, సిబ్బందితో వచ్చి కూల్చారని ఆయన కోర్టుకు వెల్లడించారు. ఎన్ కన్వెన్షన్ నిర్మాణంపై ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తోందని, హైడ్రా అధికారులు దీనిని పట్టించుకోకుండా కూల్చేశారని ఆయన వాదించారు. నిబంధనలకు విరుద్ధంగా హైడ్రా వ్యవహరించిందని న్యాయవాది శ్రీరామ్ కోర్టుకు వెల్లడించారు.

తుమ్ముడి కుంట ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణం ఉన్నదుకే కూల్చివేస్తున్నట్లు ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం ఎన్ కన్వెషన్ కూల్చివేతలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం పలు విషయాలను వెల్లడించింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున కొన్ని సంవత్సరాల కిందట, అప్పటి ప్రభుత్వ సర్వే ప్రకారం స్వార్జితంతో కొనుగోలు చేసిన భూమిలో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని పేర్కొన్నారు. 2010-12 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తయిందని, అయితే ఆ భూమి చెరువు సరిహద్దు పరిధిలోకి వచ్చిందని ఆనాటి ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. నోటీసులు జారీచేసిన భూమి మీద మరో మూడు, నాలుగు సర్వే రిపోర్టులు సైతం సర్క్యులేషన్‌లో ఉన్నాయని, దీంతో నాగార్జున ప్రభుత్వ నోటీసులపై కోర్టుని ఆశ్రయించినట్లు వెల్లడించారు. ఈ అంశంపై రూ.9 కోట్లు డిపాజిట్‌గా కట్టి ప్రభుత్వ ఆరోపణలు నిరూపిస్తే తమ నిర్మాణానికి తగిన మార్పులు చేస్తామని గతంలో నాగార్జున అంగీకరించినట్లు పిటిషన్‌లో చెప్పుకొచ్చారు.

అందుకు సమ్మతించిన ధర్మాసనం సర్కార్ ఉత్తర్వులపై స్టే విధించింది. కోర్టు ఆర్డర్ ప్రకారం స్టేలో ఉండగా, దానిని బేఖాతరు చేస్తూ ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేత ప్రక్రియను చేపట్టిందని పిటిషన్‌లో వెల్లడించారు. ఖానామెట్ గ్రామ పరిధిలో ఉన్న తుమ్మిడికుంట చెరువు 29.6 ఎకరాలు ఉంది. క్రమంగా ఆ చెరువు భూములు ఆక్రమించి నిర్మాణాలు వెలిశాయి. అందులో భాగంగా అక్కినేని నాగార్జున తన భాగస్వామి నల్లా ప్రీతమ్ రెడ్డితో కలిసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని, ఇది చెరువు పరిధిలోని ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉందంటూ గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ విషయంపై రెండు రోజుల కిందట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా హైడ్రాకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. శాటిలైట్ మ్యాప్‌లు, జిహెచ్‌ఎంసి సర్వే మ్యాప్‌లను అందించారు. వాటిని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, శనివారం ఉదయం ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు అదేశాలు జారీ చేయడంతో హైడ్రా బలగాలు రంగంలోకి దిగి కన్వెన్షన్‌ను నేలమట్టం చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News