నేతల రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని ఆంక్షలు
హైదరాబాద్: వరంగల్ బిజెపి తలపెట్టిన బహిరంగ సభకు శుక్రవారం హైకోర్టు అనుమతిచ్చింది. ఈక్రమంలో శనివారం నాడు వరంగల్ లో బిజెపి బహిరంగ సభలో నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరని హామీ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కాగా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ఈ నెల 27న వరంగల్‌లో ముగియనున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభకు వరంగల్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో వరంగల్‌లో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పాల్గొనే బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని బిజెపి నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే వరంగల్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధిస్తూ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆంక్షలు విధించారు.
ఇందులో భాగంగా వరంగల్ నగరంలో శుక్రవారం నుంచి 30 – సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తూ తరుణ్ జోషి ఉత్తర్వులిచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. పోలీసు ఆంక్షలు శుక్రవారం నుంచి ఈ నెల 31 వరకు అమల్లోఉంటాయని, ఉత్తర్వులు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బిజెపి నేతలు ఉన్నత న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ జరిపిన ధర్మాసనం శనివారం నాటి సభ నిర్వహణకు అనుమతిచ్చింది. అయితే బహిరంగ సభలో నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరని హామీ ఇవ్వాలని బిజెపిని హైకోర్టు ఆదేశించింది.
ఇది జరిగింది…
బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా శనివారం హనుమకొండలోని ఆరట్స్ కాలేజీలో భారీ బహిరంగ సభ తలపెట్టింది. ఈ సభకు భాజపా జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా హాజరు కానున్నారు. అయితే ఈ సభకు అనుమతి లేదని కాలేజీ యాజమాన్యం గురువారం వెల్లడించింది. సభకు పోలీసుల అనుమతి లేదని తెలిపింది. పోలీసుల పర్మిషన్ లేనందున తాము అనుమతించలేమని వివరించింది. ఈక్రమంలో భారీ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న బిజెపి శ్రేణులు అనుమతి నిరాకరణపై మరోసారి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై సిజె జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం సభకు అనుమతి ఇవ్వడంతో పాటు సభలో నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరని హామీ ఇవ్వాలని ఆదేశించింది.