Monday, January 20, 2025

దుర్గం చెరువుకు చుట్టూ కూల్చివేత చర్యలపై హైకోర్టు స్టే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: దుర్గం చెరువు నివాసితులకు హైకోర్టులో ఊరట లభించింది. దుర్గం చెరువు చుట్టూ కూల్చివేత చర్యలపై హైకోర్టు స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు ప్రాంత వాసు లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అభ్యంతరాలను పరిశీలించాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీని కోర్టు ఆదేశించింది. దుర్గం చెరువు నిర్వాసితులు అక్టోబర్ 4న సరస్సు పరిరక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలని సూచించింది. వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని అక్టోబరు 4 నుంచి ఆరు వారాలు లోగా తుది నోటిఫికేషన్ జారీ చేయాలని, లేక్ ప్రొటెక్షన్ కమిటీని హైకోర్టు ఆదేశించింది.

కాగా దుర్గం చెరువు ఆక్రమణ పరిధిలోని నివాసితుల్లో సిఎం సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి కూడా ఉండటం గమనార్హం. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తూ వస్తున్న హైడ్రా ఎనుముల తిరుపతి రెడ్డి ఇల్లు, కార్యాలయంతో సహా పలు ప్రముఖుల నిర్మాణాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. వాటిని 30 రోజుల్లోగా తొలగించాలని నోటీసులు అంటించారు. దీంతో కూల్చివేత నోటీసులను సవాల్ చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. 6 వారాల్లోపు కూల్చివేతలు చేపట్టబోమని కోర్టుకు జిహెచ్‌ఎంసి వెల్లడించింది. రికార్డుల ప్రకారం దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ 65 ఎకరాలే ఉందని పిటిషనర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ 160 ఎకరాలు ఉందని అధికారులు చెప్పడం సరికాదని పిటిషనర్లు వాదించారు. మాదాపూర్‌లోని అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఎనుముల తిరుపతి రెడ్డి నివాసం ఉంటున్న ఇల్లు దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు గుర్తించి ఆగస్టు 29న అధికారులు నోటీసులు అంటించారు. దీనిపై ఎనుముల తిరుపతి రెడ్డి స్పందించారు. తాను ఆ ఇంటిని 2015లో కొనుగోలు చేశానని, అది ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందనే విషయం తనకు తెలియదని వెల్లడించారు. తాను నివాసం ఉంటున్న ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకున్న తనకు అభ్యంతరం లేదన్నారు.

చెరువులు, అటవీ స్థలాలను పరిరక్షించేందుకు హైడ్రా చేపడుతున్న విస్తృత చర్యల్లో భాగంగా వారు ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని ఆయన గతంలో స్పష్టపర్చారు. కాగా ఆక్రమణల కారణంగా దుర్గం చెరువు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. దశాబ్దం కింద ఈ ఏరియాను నాన్-డెవలప్‌మెంట్ జోన్‌గా గుర్తించారు. కానీ దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో చెరువు విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. ఇంజినీర్లు, రాజకీయ నాయకులు, రిటైర్డ్ బ్యూరోక్రాట్‌లు, ఎంతోమంది ఉన్నత స్థాయి వ్యక్తులు ఈ చెరువు చుట్టూ ఆక్రమణకు గురైన ప్రాంతాల్లో నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. వారిలో చాలామందికి అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News