Friday, December 20, 2024

చంద్రబాబుకు హైకోర్టులో ఊరట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిడిపి అధినేత చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబు పిటిషన్లపై ఎపి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంగళ్లు కేసులో గురువారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ సోమవారం (16వ తేదీ) వరకు అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు, అంగళ్లు కేసుల్లో విచారణకు చంద్రబాబు సహకరిస్తాడని ఆయన తరఫున లాయర్లు కోర్టుకు విన్నవించారు. ఈ రెండు కేసుల్లో టిడిపి అధినేత దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.

ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. కేసుల్లో విచారణకు సహకరిస్తామని కోర్టుకు తెలిపారు. ఈ విషయంపై సిఐడి, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులను కోర్టు కోరింది. ఎసిబి కోర్టులో పిటి వారెంట్ పెండింగ్‌లో ఉందని, ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని ఎజి శ్రీరామ్ కోర్టును కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం రెండు కేసుల్లోనూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పిటి వారెంట్, పోలీస్ కస్టడీపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని ఎసిబి కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కీలకం కానున్న సుప్రీం ఆదేశాలు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు 33 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణ ఈ నెల 13కు వాయిదా పడింది. చంద్రబాబును అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు కేసుల్లో అరెస్ట్ చేకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన తరఫు లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో చంద్రబాబు న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు వాటిని తిరస్కరించింది. దీంతో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం విచారణ జరిగింది. అంగళ్లు, ఐఆర్‌ఆర్ కేసుల్లో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయవాదులు కోర్టును కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు చంద్రబాబుకు కాస్త ఉపశమనం కల్పించింది. అంగళ్లు కేసులో గురువారం వరకు, ఐఆర్‌ఆర్ కేసులో సోమవారం వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పైన విచారణ కీలకంగా మారనుంది.

చంద్రబాబును కోర్టుకు తీసుకురావాలన్న సిఐడి న్యాయవాది
ఫైబర్ నెట్ కేసు విచారణ నేటికి వాయిదా
ఫైబర్ నెట్ కేసులో పిటి వారెంట్‌పై విచారణను ఎసిబి న్యాయస్థానం ఈ నెల 12కు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబును కోర్టుకు తీసుకు రావాలని సిఐడి తరఫు న్యాయవాది పిపి వివేకానంద కోర్టును కోరారు. పిటి వారెంట్‌పై సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ప్రధాన ముద్దాయి అని, ఈ కేసులో రూ.115 కోట్ల నిధుల గోల్ మాల్ జరిగినట్లు సిట్ దర్యాఫ్తులో వెల్లడైందన్నారు. ఫైబర్ నెట్ అంశంలో చంద్రబాబు పాత్రను గుర్తించిన తర్వాతే ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు తెలిపారు. టెర్రా సాఫ్ట్‌కు అక్రమ మార్గంలో టెండర్లు ఖరారు చేసేందుకు అక్రమాలకు పాల్పడ్డారని సిఐడి న్యాయవాది అన్నారు.

టెర్రా సాఫ్ట్ కోసం నిబంధనలకు విరుద్ధంగా టెండర్ గడువును వారం రోజులు పొడిగించారన్నారు. ఈ అంశంలో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ఇడి గుర్తించిందన్నారు. చంద్రబాబు తన ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. పీటీ వారెంట్‌పై సిఐడి న్యాయవాది సుదీర్ఘ వాదనలు వినిపించారు. వాదనలు కొనసాగించేందుకు ఎసిబి న్యాయస్థానం సమ్మతించింది. దీంతో గురువారం మధ్యాహ్నం గం.2.30కు తదుపరి వాదనలు విననుంది. మరోవైపు కాల్ డేటా పిటిషన్‌పై వాదనలు వినాలని కోర్టును చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. గురువారం మధ్యాహ్నం వాదనలు వినేందుకు న్యాయస్థానం అంగీకరించింది.
పిటి వారెంట్ అంటే ఏంటి?
పీటీ వారెంట్ అంటే (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్). ఇప్పటికే జైలులో ఉన్న ఖైదీని మరో కేసులో విచారణ కోసం, జైలు నుంచి ఇంకో ప్రాంతానికి తరలించేలా కోర్టు అనుమతి కోరతారు. అప్పుడు కోర్టు పిటి వారెంట్ ఇస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే జైలులో ఉన్న ఖైదీని మరో చోటికి తరలించడం. సిఆర్‌పిసిలోని సెక్షన్ 269 కింద కోర్టు పిటి వారెంట్‌ని ఇస్తుంది.

సెప్టెంబరు 19న పిటి వారెంట్ దాఖలు
ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుపై మరో పిటి వారెంట్ ను సెప్టెంబరు 19న ఎసిబి కోర్టులో సిఐడి దాఖలు చేసింది. ఎపి ఫైబర్ నెట్ స్కాంపై సిఐడి పిటి వారెంట్ వేసింది. టెర్రా సాఫ్ట్ కి అక్రమంగా టెండర్లు ఇచ్చారని సిఐడి ఆరోపించింది. అందులో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా సిఐడి పేర్కొంది. 2021లో మొత్తం 19 మందిపై సిఐడి కేసు నమోదు చేసింది. రూ.121 కోట్లు గల్లంతు అయ్యాయని సిఐడి ఆరోపించింది. సిఐడి చేస్తున్న ఆరోపణల ప్రకారం ఫైబర్ నెట్ స్కాంలో రూ.115 కోట్ల నిధులు దోచుకున్నారని సిట్ దర్యాప్తులో తేలింది. 2019లోనే ఫైబర్ నెట్ స్కాంపై 19 మందిపై సిఐడి కేసు నమోదు చేసింది. దీంట్లో ఎ1గా వేమూరి హరి ప్రసాద్, ఎ2 మాజీ ఎండి సాంబశివరావుగా పేర్కొంది.

చంద్రబాబుకు వేమూరి హరిప్రసాద్ అత్యంత సన్నిహితుడు. దీంతో ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు పాత్రను సిఐడి గుర్తించింది. టెర్రా సాఫ్ట్‌కు అక్రమ మార్గంలో టెంబర్లు ఇవ్వడంపై సిఐడి విచారణ జరిపింది. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ గడువు వారం రోజులు పొడిగించినట్లు తేల్చింది. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న టెర్రా సాఫ్ట్‌కు టెండర్ దక్కేలా మేమూరి హరిప్రసాద్ చక్రం తిప్పారని గుర్తించింది. ఫైబర్ నెట్ ఫేజ్-1లో రూ.320 కోట్లకు టెండర్లు వేయగా రూ. 115 కోట్ల అవినీతి జరిగిందని సిఐడి ఆరోపించింది. టెర్రా సాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు అవకతవకలు జరిగాయని సిఐడి వివరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News