కెఎ పాల్ పిటిషన్‌పై హైకోర్టు స్పష్టం
హైడ్రాకు, ప్రభుత్వానికి నోటీసులు
కేసు 14 వ తేదికి వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్ : హైడ్రా చేపట్టిన కూల్చివేతలను ఆపాలేమని హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. కూల్చివేతలను ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ మేరకు కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రాకు అధికారాలు కల్పిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 99పై స్టే విధించాలని పిటిషన్‌దారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, ఈ దశలో కూల్చివేతలను ఆపలేమని పేర్కొంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాకే కార్యాచరణను చేపట్టాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసే పక్షంలో 30 రోజుల ముందు నోటీసులు జారీ చేయాలని పిటిషన్‌దారు కోరారు. ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చిన హైడ్రా, రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.