జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
మన తెలంగాణ/హైదరాబాద్ : రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. సెక్షన్ 10ఎ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు కొట్టివేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధం అని హైకోర్టు స్పష్టం చేసింది. జీవో 16 ద్వారా గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం వేలాది మందిని రెగ్యులరైజ్ చేసింది. ముఖ్యంగా విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించింది.
తాజాగా హైకోర్టు సంచలన తీర్పుతో రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగుల భవితవ్యం మళ్లీ ఆందోళనలో పడింది. బిఆర్‌ఎస్ ప్రభుత్వం రెగ్యూలరైజ్ చేసిన ఉద్యోగులను తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగించాల్సి ఉంటుందని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది పిటిషనర్లు వెల్లడించారు. అయితే దీనిపై హైకోర్టు నుంచి తమకు ఆర్డర్ కాపీ వస్తే స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఇకపై ఆ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయడం కుదరదు
ఎన్నో ఏళ్లుగా సగం జీతానికే సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పుడైనా మమ్మల్ని గుర్తించి, మా కుటుంబ సమస్యలు తెలుసుకుని జాబ్ పర్మినెంట్ చేయాలి… ఇదే మాట కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి తరచుగా వింటూనే ఉంటాం. కొన్నిసార్లు ప్రభుత్వాలు వారిపై సానుకూల నిర్ణయాలు తీసుకుని రెగ్యూలరైజ్ (ఉద్యోగాల క్రమబద్ధీకరణ) చేస్తాయి. తెలంగాణలో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం సైతం కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవల్ని గుర్తించి, వారి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి సెక్షన్ 10ఎ ప్రకారం జీవో 16 తీసుకొచ్చింది.
దీని ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులను కెసిఆర్ ప్రభుత్వం పర్మినెంట్ చేసి వారి కుటుంబాల్లో వెలుగులు నింపింది. అయితే నియామక పరీక్షలు నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాలి కానీ, నేరుగా వారిని రెగ్యూలరైజ్ చేయడం రాజ్యాంగ విరుద్ధం అంటూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం మంగళవారం విచారించింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. దాంతో రెగ్యూలరైజ్ అయిన ఉద్యోగులు మళ్లీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారనున్నారు. ఏళ్ల తరబడి పడుతున్న వారి కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయని చెబుతున్నారు.