Monday, December 23, 2024

మణిపూర్‌లో సామూహిక ఖననంపై హైకోర్టు స్టే

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్‌లో గత మూడు నెలలుగా జరుగుతున్న ఆందోళనల్లో మృతి చెందిన 35 మంది మృతదేహాలను ఖననం చేసేందుకు గురువారం కుకీజోమి వర్గానికి చెందిన గిరిజన నాయకుల ఫోరం సిద్ధమైంది. అయితే దీనిపై మణిపూర్ హైకోర్టు స్టే విధించింది. సామూహిక ఖననానికి నిర్దేశించిన ప్రాంతంలో యధాస్థితిని కొనసాగించాలని హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ మురళీధరన్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అభ్యర్థన మేరకు ఐదు రోజుల పాటు మృతదేహాల ఖననం ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు ఐటీఎల్‌ఎఫ్ ప్రకటించింది.

“ కేంద్ర హోంశాఖ అభ్యర్థన మేరకు మృతదేహాల ఖననాన్ని ఐదు రోజులు వాయిదా వేయాలని నిర్ణయించాం. మృతదేహాలను ఖననం చేసేందుకు మేం ఎంచుకున్న స్థలాన్ని ప్రభుత్వం అధికారికంగా గుర్తించి అనుమతులు జారీ చేస్తామని హామీ ఇచ్చింది. మిజోరం సిఎం సైతం ఇదే విషయంపై మమ్మల్ని అభ్యర్థించారు. ఈ విషయమై ఐదు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాం” అని ఐటీఎల్‌ఎఫ్ తెలిపింది. అంతకు ముందు చురాచంద్‌పుర్ జిల్లా హవోలై ఖోపి ప్రాంతంలో గత మూడు నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లలో మరణించిన కుకీజోమి వర్గానికి చెందిన 35 మందిని సామూహిక ఖననం చేయనున్నట్టు ఐటీఎల్‌ఎఫ్ ప్రకటించింది.

దీంతో ఆ వర్గానికి చెందిన ప్రజలు హవోలై ఖోపికి చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం చురాచంద్‌పుర్ జిల్లాల్లో అదనపు బలగాలను మోహరించింది. బిష్ణుపుర్ జిల్లాలో భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి సామూహిక ఖననం చేసే ప్రాంతానికి చేరుకునేందుకు స్థానికులు ప్రయత్నించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. ఈ ఘటనలో 17 మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తూర్పు, పశ్చిమ ఇంఫాల్ ప్రాంతంలో కర్ఫూను తిరిగి అమలు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News