ఇంఫాల్: జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితులకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ రాజీనామాకు సిద్ధమయ్యారు. అయితే ఈ నిర్ణయాన్ని మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించడంతో చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్టా రాజీనామా చేయడం లేదని బీరేన్ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలోనే చించేసిన రాజీనామా లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేయనున్నట్లు శుక్రవారం ఉదయంనుంచే వార్తలు వచ్చాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి రాష్ట్ర గవర్నర్ అనసూయ ఉకియ్‌తో భేటీ కానున్నట్లు కూడా పలు మీడియయా కథనాలు వచ్చాయి.
ఈ వార్తలు బయటికి రాగానే పెద్ద సంఖ్యలో మహిళా మద్దతుదారులు సిఎం నివాసానికి పోటెత్తారు. ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ నినాదాలు చేశారు. తాము సిఎంను వెళ్లనీవబోమంటూ మానవహారంగా ఏర్పడ్డారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం తన నివాసంనుంచి కాన్వాయ్‌లో బైటికి వచ్చిన ముఖ్యమంత్రిబీరేన్ సింగ్ మద్దతుదారులకు అభివాదం చేశారు. అయితే ఆయనను ముందుకు వెళ్లనీయకుండా మహిళలు అడ్డుకున్నారు. దీంతో ఆయన తిరిగి తన నివాసంలోకి వెళ్లిపోయారు. ప్రజలనుంచి వస్తున్న మద్దతును చూసి ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ క్రమంలోనే చించేసిన రాజీనామాపత్రాలు కనిపించడం గమనార్హం. వీటిని మహిళా మద్దతుదారులు చించేసినట్లు కొన్ని వీడియోలు బయటికి వచ్చాయి. వారు సిఎం చేతుల్లోని రాజీనామా లేఖను లాక్కొని చించేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంఫాల్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
మూడుకు చేరిన మృతుల సంఖ్య
ఇదిలా ఉండగా గురువారం కంగ్‌పోక్పి జిల్లాలో భద్రతా దళాలు,ఆందోళనకారుల మధ్య కాల్పుల్లో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వ్యక్తి శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.గురువారం కాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు ఆందోళనకారుల మృతదేహాలను అందుకున్న వారి కులస్థులు మృతదేహాలతో ముఖ్యమంత్రి నివాసానికి ఊరేగింపుగా బయలుదేరారని అధికారులు చెప్పారు. మహిళల నేతృత్వంలోని ఆందోళనకారులు దమ్ముంటే తమను అరెస్టు చేయాలని పోలీసులకు సవాలు విసరడంతో పాటు పోలీసులు ముందుకు రాకుండా ఉండడానికి రోడ్డు మధ్యలో టైర్లు తగులబెట్టారు.
దీంతో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించడంతో పాటుగా లాఠీచార్జి జరిపారు. రిజర్వేషన్ల విషయంలో మైతేయి, కుకీల మధ్య గత నెల ప్రారంభంలో మొదలైన ఘర్షణల్లో ఇప్పటివరకు వందమందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే. వేల మంది భద్రతా బలగాలను, ప్రత్యేక పోలీసులను రంగంలోకి దింపినప్పటికీ పరిస్థితి ఇప్పటికీ అదుపులోకి రాలేదు. 50 రోజులు దాటిపోయినప్పటికీ నేతల నివాసాలకు నిప్పుపెట్టడం, మూకదాడులు వంటివి కొనసాగుతూనే ఉన్నాయి.