Wednesday, January 22, 2025

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటనపై హైలెవల్ కమిటీ విచారణ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ఈ సంఘటనతో దక్షిణమధ్య రైల్వేకు రూ.20 కోట్ల నష్టం

హైదరాబాద్: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ (హైలెవల్ కమిటీ) విచారణ ప్రారంభించింది. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది నుంచి వివరాలను సేకరించింది. ప్రమాదంపై రైల్వే అధికారులు రెండు రోజుల పాటు వివరాలను సేకరించనున్నారు. సికింద్రాబాద్‌లోని రైల్వే సంచాలన్ భవన్‌లో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది నుంచి ఉన్నతస్థాయి విచారణ కమిటీ అవసరమైన వివరాలను సేకరిస్తోంది. ఈ రెండు రోజుల పాటు ప్రమాదంపై వివరాలను అధికారులు సేకరించనున్నారు. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగడం ప్రమాదమా? కుట్ర కోణమా? అనే దానిపై ఈ కమిటీ ఆరాతీస్తోంది. మరోవైపు ఈ ప్రమాదంలో సామగ్రి, విలువైన వస్తువులు కోల్పోయిన ప్రయాణికుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ప్రమాద సంఘఘటన గుంటూరు డివిజన్ పరిధిలోకి రావడంతో ఆ రైల్వే డివిజన్ అధికారులు విచారణ చేపట్టారు. సికింద్రాబాద్‌లోని రైల్వే సంచాలన్ భవన్లో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు కొనసాగుతోంది.
వివరాలు సేకరిస్తున్న మెకానికల్, లోకో డిపార్ట్‌మెంట్, ఎలక్ట్రికల్ విభాగాలు
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై మెకానికల్, లోకో డిపార్ట్‌మెంట్, ఎలక్ట్రికల్, భద్రత విభాగాలు వివరాలు సేకరిస్తున్నాయి. ప్రత్యక్షసాక్షులు, అనుమానం ఉన్నవారి నుంచి ముఖ్య భద్రతా అధికారి, చీఫ్ కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసెస్ మేనేజర్ , ఇతర ఉన్నతాధికారులు సంఘటన వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ఘటనతో రైల్వేకు రూ.20 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎస్4, ఎస్5, ఎస్6 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వివిధ చోట్ల నుంచి అగ్నిమాపక యంత్రాలను రప్పించి అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని, ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News