Sunday, January 19, 2025

ప్రధాని కార్యాలయం ఉన్నత స్థాయి సమీక్ష

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మునిగిపోతున్న ఉత్తరాఖండ్ పట్టణం జోషిమఠ్ పరిస్థితిపై ప్రధాన మంత్రి కార్యాలయం ఉన్నత స్థాయి సమావేశం జరుపుతుంది. హిమాలయ పర్వత శ్రేణులలోని ఈ పట్టణంలోని వందలాది భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. రోడ్లపై భారీ స్థాయిలో గుంతలు తలెత్తాయి. పట్టణం పూర్తిగా కూరుకుపోతుందనే భయాందోళనల నడుమ ఇప్పుడు పిఎంఒ దీనిపై ఉన్నత స్థాయి సమీక్షకు దిగుతోంది. ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పర్యాటకులు, యాత్రికులు వస్తుంటారు. ఛార్‌దామ్ యాత్ర మార్గంలో ఈ పట్టణం ఉంది.

అక్కడ తలెత్తిన విపత్కర పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య కార్యదర్శి పికె మిశ్రా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తారు. ఇందులో కేబినెట్ సెక్రెటరీ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు, జాతీయ విపత్తు నిర్వహణల సంస్థ సభ్యులు పాల్గొంటారని ఆదివారం వెలువడ్డ అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ సమీక్షా సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది. ఇందులో జిల్లా అధికారులు, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు కూడా పాల్గొంటారని ప్రకటనలో వివరించారు.

ధామితో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ
మరో వైపు ప్రధాని మోడీ జోషీమఠ్ పరిస్థితి గురించి ముఖ్యమంత్రితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రధాని తెలిపినట్లు ఆ తరువాత ముఖ్యమంత్రి ట్వీటు వెలువరించారు. పర్వతాలపై ఉండే పట్టణాలు, మారుమూల పల్లెల్లో పరిస్థితి గురించి చర్చించుకున్నట్లు వెల్లడించారు.

స్థాయి నిర్మాణపనులు, జలవిద్యుత్ ప్రాజెక్టులతో ముప్పు
ఈ ప్రాంతం నైసర్గికంగా అత్యంత కీలకమైన సున్నితమైన ప్రకంపనలు కేంద్రీకృత స్థలంలో ఉంది. హిమాలయ పర్వత శ్రేణువులు, మరో వైపు పలు ప్రవాహాలు నదులు తరచూ ఈ ప్రాంతంలోని భూగర్భ పరిస్థితిని దెబ్బతీస్తూ ఉంటాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో నిర్మాణపు పనులు జరగడం, హైడ్రోపవర్ ప్రాజెక్టులు జోరుగా నిర్మాణంలో ఉండటంతో అంతర్గతంగా భూమిపొరలలో తలెత్తిన ఒత్తిడి పరిణామాలు ఇప్పటి పరిస్థితికి దారితీస్తున్నట్లు నిపుణులు తెలిపారు. ఇది క్రమేపీ నేల మట్టం అవుతుందని కూడా విశ్లేషకులు హెచ్చరించారు.

శీతాకాలంలో బద్రీనాథ్ శివుడికి పూజలు జరిపే నేల
దాదాపు 17000 మందికి పైగా ఉండే ఈ పట్టణం హిందూ , సిక్కు పుణ్యక్షేత్రాలకు ముఖద్వారం. ఇక్కడి నుంచే బద్రీనాథ్, హేమ్‌కుంద్ సాహిబ్ వంటి ప్రాంతాలకు జనం వెళ్లుతుంటారు. పర్వతారోహకులు ఈ ప్రాంతం నుంచే సాహస విన్యాసాలకు ఔలిలోని కేంద్రానికి చేరుకుంటారు. ఈ విధంగా పలువురికి ఈ ప్రాంతం విడిదిగా ఉంది. బద్రీనాథ్‌కు వెళ్లే చాలా మంది రాత్రి ఇక్కడనే బస చేసి ఉదయం వెళ్లుతుంటారు. సైనికులకు , పర్వతారోహకులకు ఇది బేస్ క్యాంప్‌గా ఉంది. మరో ప్రత్యేకత ఏమిటంటే బద్రీనాథ్ క్షేత్రాన్ని శీతాకాలంలో మూసివేసిన తరువాత బద్రీనాథుడి విగ్రహాన్ని ఇక్కడికే తీసుకువచ్చి దైనందిన పూజాదికాలు నిర్వహిస్తారు. భారత సైనిక దళాలకు అత్యంత వ్యూహాత్మక ప్రాంతం అయిన జోషిమఠ్ ధౌలిగంగా, అలకానంద నదుల సంగమ స్థలి అయిన విష్ణు ప్రయాగకు చేరువలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News