పెబ్బేరు : మరికొద్ది రోజులలో ఆషాఢమాసం ముగుస్తోంది. మంచి ముహుర్తాల కోసం పడిగాపులు గాయల్సి ఉంటుంది. అనంతరం లక్ష్మి ప్రదమైన శ్రావణమాసం ప్రవేశిస్తుంది. ఈ సారి రెండు శ్రావణమాసాలు రాబోతున్నాయి. వాటిలో మొదటిది ఈ నెల 18 నుంచి అధిక మాసం ప్రారంభం కానుంది. ఇంతకీ అధికమాసం అంటే ఏమిటి..?, అధిక శ్రావణంలో శుభకార్యాలు చేయవచ్చా వంటి ఎన్నో ప్రశ్నలు సహజంగానే ఎదురవుతాయి. జోతిష్య శాస్త్రం ప్రకారం కాలగణన సూర్య చంద్రుల ఆధారంగా జరుగుతుంది.
సూర్యుడిని ఆధారంగా తీసుకుని లెక్కకట్టే కాలమానాన్ని సౌరమానం అని, చంద్రుణ్ణి ఆధారంగా తీసుకునే సంవత్సరం గణనాన్ని చంద్రమానమని అంటారు. చంద్రమాణం నెల అంటే 29.53 రోజులు. దీని ప్రకారం చంద్రమానంలో ఏడాదికి 354 రోజులు, సౌరమానంలో ఏడాదికి 365 రోజులు ఉంటాయి. సౌరమానానికి, చంద్రమానానికి మధ్య ఏడాదిలో 11 రోజుల తేడా ఏర్పడుతుంది. ఈ వ్యత్యాసాన్ని సరి చేయడానికి 32 నెలలకు ఒక సారి ఒక మాసాన్ని అధికంగా జోడిస్తారు. దానినే అధికమాసం అంటారు.
అధిక మాసంలో ఏం చెయ్యాలి..? అధిక మాసాలలో శుభాకార్యాలను ఆచరించడం నిషేద్ధమని శాస్త్రలు తెలియజేస్తున్నాయి. దీని ప్రకారం వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు తదితరాలను ఈ మాసంలో చేయకూడదు. పితృకార్యాలను కూడా అధికమాసంలో కాకుండా నిజ మాసంలోనే జరపాలి. కానీ అధికమాసానికి తనదైన విశిష్టత ఉంది. మహా విష్ణువుకు ఇది ప్రత్యేకమైన నెల. కాబట్టి పురుషోత్తమ మాసం అనే పేరును ఆయన ప్రసాదించాడని, ఈ మాసంలో చేపట్టే దైవకార్యాలకు అధికమైన ఫలాలు లభిస్తాయని వరమిచ్చాడని పురాణాలు చెబుతున్నాయి.
అధిక మాసంలో శుక్ల పక్షంలో కానీ, కృష్ణ పక్షంలో కానీ అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి అలాగే పౌర్ణమి రోజునైన కనీసం పుణ్య కార్యాలు చేయాలి. దానివల్ల వారికి అపారమైన పుణ్యఫలం లభిస్తుంది అని ఆయన చెప్పనట్లు పౌరాణిక కథ ఒకటి ఉంది. కాబట్టి అధిక మాసంలో దైవారాధనలు, పితృఆరాధన, పూజలు, దాన ధర్మాలు చేయడం వల్ల విశిష్టమైన ఫలితాలు లభిస్తాయి. ప్రధానంగా విష్ణుమూర్తి ఆరాధన, విష్ణు సహస్రనామ పథనం, ఏకాదశి ఉపవాసాలు, వ్రతాలు, దీక్షల వల్ల రెట్టింపు ఫలాలు పొందవచ్చన్నది పెద్దల మాట.