సున్నిత ప్రాంతాలలో 144 సెక్షన్ కొనసాగింపు
బెంగళూరు: హిజాబ్ వివాదం కారణంగా వారం రోజులుగా మూతపడిన కర్నాటకలోని ఉన్నత పాఠశాలలు ఉడుపిలో నిషేధాజ్ఞల నేపథ్యంలో సోమవారం పునఃప్రారంభమయ్యాయి. దక్షిణ కన్నడ, బెంగళూరులోని కొన్ని సున్నిత ప్రాంతాలలో 144 సెక్షన్ ఇప్పటికీ అమలులో ఉంది. హిజాబ్ వివాదం కారణంగా ఘర్షణలు తలెత్తిన ఉడుపి జిల్లాలో అన్ని పాఠశాలలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. హిజాబ్ ధరించి స్కూలు ప్రాంగణాల లోకి ప్రవేశించిన ముస్లిం బాలికలు తరగతి గదులలోకి వెళ్లే ముందు వాటిని తీసివేశారని విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. నుడు జరగవలసి ఉన్న పరీక్షలు నిర్ణీత ప్రకారం జరిగాయని వారు చెప్పారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు హిజాబ్‌లు తొలగించి ముస్లిం విద్యార్థినులు తరగతులకు హాజరయ్యారని, అయితే హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు వేసుకున్నట్లు సమాచారం లేదని ఉడుపి తహసిల్దార్ ప్రదీప్ కురుడేకర్ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా ఉడుపి పట్టణంలో, పాఠశాలల సమీపంలో పోలీసు పిక్కెట్లను ఏర్పాటు చేశారు. ఇలా ఉండగా..కల్లోల పరిస్థితిని నివారించి శాంతిని పరరిక్షించాలని ఉడుపి పేజావర్ మఠాధిపతి స్వామి విశ్వప్రసన్న తీర్థ అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.