55 నిమిషాలలో గమ్యం చేరిక
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నుంచి మీరట్‌కు ఇప్పుడు అత్యంత వేగంతో వెళ్లే ర్యాపిడ్ రైలురానుంది. ఈ ట్రైన్ గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఢిల్లీ నుంచి75 కిలోమీటర్ల దూరంలోని మీరట్‌కు 55 నిమిషాలలో చేరుతుంది. సంబంధిత రైలు ట్రయల్ ప్రయాణం తొలిదశ త్వరలో జరుగుతుంది. దేశంలో ఇటువంటి పలు అత్యంత వేగవంతపు రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీ మీరట్ రైలుకు పలు ప్రత్యేకతలు ఉంటాయి. దేశంలోనే గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైలు ఇదే అవుతుంది. పైగా బిజినెస్ లేదా ప్రీమియం కోచ్ కూడా ఉంటుంది. రీజినల్ కారిడార్‌లో ఇటువంటి సౌకర్యం ఇదే తొలిసారి అవుతుంది. ఈ రైలు ప్రయాణంలో భాగంగా ఇప్పటికే ఢిల్లీ నుంచి యుపిలోని దుహాయ్ వరకూ 17 కిలోమీటర్ల మేర ట్రయల్ రన్ నిర్వహిస్తారు. అత్యంత వేగపు ఈ రైలు ప్రయాణికులకు వచ్చే సంవత్సరం అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.