Sunday, January 12, 2025

చీకటి ఒప్పందాలు బయట పడుతాయని అడ్డుకుంటున్నారు

- Advertisement -
- Advertisement -

అసెంబ్లీ గేటు వద్ద బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలను పోలీసులు అడ్డుకున్నారు. కెటిఆర్, హరీశ్ రావు సహా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు అదానీ, రేవంత్ రెడ్డి ఫొటోతో కూడిన టీ షార్ట్ ధరించడం పట్ల భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. సిఎం రేవంత్‌రెడ్డి – అదానీ ఫొటో ముద్రించిన టీషర్టులు ధరించిన తమను అసెంబ్లీలోకి అనుమతించకపోవడంపై బిఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బందికి, బిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. దీంతో అసెంబ్లీ గేట వద్ద నిరసన చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ లోపలకి అదానీ, రేవంత్ ఫొటోతో టీషర్టులు తొలగించి వెళ్లాలని పోలీసులు సూచించారు. అయినా ఆ టీషర్టులతోనే లోపలికి వెళ్తామని తేల్చి చెప్పడంతో కొద్దిసేపటి వరకు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను, ఎంఎల్‌సిలను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకుని,అక్కడి నుంచి తరలించారు.

నిర్బంధాలు, దాడులకు వ్యతిరేకంగా బిఆర్‌ఎస్ పోరాటం : కెటిఆర్
రేవంత్ రెడ్డి అదాని ఆ పవిత్రమైన కలయిక పైన, వారి కుమ్మక్కు పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీస్తామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అదానికి అనుచితమైన లబ్ధి చేకూర్చే విధంగా అనేక కుట్రలకు పాల్పడుతున్నారని, అయితే ఇదే అదానిని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఆదానితో కొట్లాడుతున్నట్టు నాటకాలు ఆడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రాజెక్టులను, తెలంగాణ వనరులను అదానికి దోచిపెట్టే కుట్రను చేస్తున్నదని.. తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే కుట్రలను ఎండగడుతామని చెప్పారు.

బలవంతంగా భూములు గుంజుకుంటున్న వారి పక్షాన పోరాడుతునే ఉంటామని, వారి తరపున ప్రభుత్వాన్ని ఎండగడుతునే ఉంటామని ప్రకటించారు. పార్లమెంటులో ఒక నీతి, శాసనసభలో ఒక నీతి ఎట్లా ఉంటుందని ప్రశ్నించారు. పార్టమెంటు ప్రోసీజర్స్ దేశమంతా ఒకేవిధంగా ఉండాలని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల మొదటిరోజే రోడ్డు మీద నిలబెట్టారని, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలను అసెంబ్లీ ముందు నిలబెట్టడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్, ప్రియాంకతోపాటు 100 మంది ఎంపీలు అదానీ, ప్రధాని బొమ్మ వేసుకొని పార్లమెంటు లోపలికి వెళ్లవచ్చు గానీ తెలంగాణలో అసెంబ్లీ లోపలికి వెళ్లొద్దని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఢిల్లీలో కుస్తీ..గల్లీలో దోస్తీలా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి వైఖరిని ఎండగట్టేందుకే నిరసన తెలుపుతామని హెచ్చరించారు.

పోలీసులు అడ్డం పెట్టుకుని అడ్డుకుంటున్నారు
బిఆర్‌ఎస్‌కు సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మలు పోలీసులను అడ్డంపెట్టుకొని.. తమ పార్టీ ప్రజాప్రతినిధులను అసెంబ్లీ, కౌన్సిల్‌లోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారని కెటిఆర్ మండిపడ్డారు. కెసిఆర్ దీక్ష చేయకబోయి ఉంటే, డిసెంబర్ 9 నాడు ప్రకటన రాకపోయి ఉంటే తెలంగాణ శాసనసభ, శాసనమండలి ఉండేదా..? అని ప్రశ్నించారు. అదానీతో రేవంత్ రెడ్డికి ఉన్న అక్రమ సంబంధాన్ని బయటపెడతామని ప్రకటించారు. రాష్ట్రంలోని పేద, చిన్న సన్నకారు రైతుల పక్షాన కొట్లాడుతునే ఉంటామని స్పష్టం చేశారు.

ప్రధాని, అదానీ ఒకటే అంటూ రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలకు హాజరు అయ్యారని తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి, అదానీతో వ్యాపార లాభాలతో పాటు అనేక రకాల కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీ మౌనం వహించిందని..అందుకు కారణం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపిస్తున్న డబ్బు సంచులేనని ఆరోపించారు. రేవంత్ విధానాలు, అరాచకపాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ నిర్బంధాలకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఎన్ని నిర్బంధాలు, దాడులకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పోరాటం చేయడం ఆపబోమని కెటిఆర్ స్పష్టం చేశారు.

చీకటి ఒప్పందాలు బయట పడుతాయని అడ్డుకుంటున్నారు : హరీష్‌రావు
శాసనసభలోకి వెళ్లకుండా ప్రతిపక్ష నాయకులను అడ్డుకొని అరెస్టులు చేయడం పట్ల తీవ్ర మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదానీ దొంగ అని, అవినీతి చేసిండని రాహుల్ గాంధీ తిడితే, రేవంత్ రెడ్డి ఇక్కడ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు.అలాయ్ బలాయ్ చేసుకుంటూ, ఆదానీతో వేలకోట్ల రూపాయలు ఒప్పందాలు చేసుకున్నారని పేర్కొన్నారు. వివిధ మార్గాల్లో ప్రతిపక్షాలు నిరసనలు తెలియచేస్తుంటాయని, అడ్డుకోవడం దుర్మార్గం అని మండిపడ్డారు.

అక్రమ సంబంధాలు, చీకటి ఒప్పందాలు బయట పడుతాయని ప్రతిపక్షాన్ని సభలోకి రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. సభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆదానీతో చీకటి ఒప్పందం బయటపడిందని, తాము ప్రశ్నిస్తామని భయపడుతున్నారని పేర్కొన్నారు. తమను సభలోకి రాకుండా ఎందుకు ఆపుతున్నావు రేవంత్ రెడ్డి..? అని సిఎంను ప్రశ్నించారు. పార్లమెంట్‌లో రాహుల్, ప్రియాంకలు ఆదానీ, మోడీ బాయి బాయి అనే స్లోగన్స్‌తో టీ షర్టులు వేసుకున్నారని, తాము ఇక్కడ అదే విధంగా మీ చీకటి ఒప్పందాన్ని ప్రశ్నిస్తే తప్పేంటి..? అని సిఎంను నిలదీశారు. సిఎం తప్పు చేశారు కాబట్టే ఆయనకు భయం అని మండిపడ్డారు.

గన్‌పార్క్ వద్ద నివాళులు అర్పించిన బిఆర్‌ఎస్ సభ్యులు
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు గర్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లకా్ష్మరెడ్డి, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితతోపాటు బిఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరవీరులను కీర్తిస్తూ ఎంఎల్‌సి దేశపతి శ్రీనివాష్ గేయాన్ని ఆలపించారు. ఆ సమయంలో కెటిఆర్ సహా ఆ పార్టీ నేతలంతా దేశపతి పాటను అనుసరిస్తూ నివాళులర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News