మామిడికాయే కాదు మంచి నీరూ ప్రాణం తీస్తుంది, కులం త్రాచు పామును తొక్కినవాడు ప్రాణాలతో మిగులుతాడా, బాలుడనే జాలి, దయ కలుగుతాయా? ఈ దేశంలో నీటికి, నీడకు కూడా కులముంటుంది. దాహానికి, ఆకలికి అంటుకొని బుసలుకొడుతుంది. అందరు తాగే నీరు ఒకటి కాదు, వెలి కుండలు, వెలి గ్లాసుల విష సంస్కృతి ఇంకా కాటు వేస్తూనే ఉంది. రాజస్థాన్ లోని జలోర్ జిల్లా సరస్వతి విద్యామందిర్ పాఠశాలలో మూడో తరగతి చదువుకొంటున్న 9 సంవత్సరాల ఇంద్ర మేగ్వాల్ అనే బాలుడి మరణానికి గల కారణం తెలిసిన వారెవరికైనా గుండెలు పిండేసినట్టు, మనసును మంటల్లోకి తోసేసినట్టు ఉండకపోతే ఆశ్చర్యపోవాలి. గత నెల 20న ఈ బాలుడు పాఠశా లలోని అగ్ర కులస్థులకు కేటాయించిన కుండలోని నీళ్లు తాగాడని ఆ స్కూల్ టీచర్ చితకబాదాడు. ఆ గాయాలు చికిత్సకు లొంగకపోడంతో మొన్న శనివారంనాడు మృతి చెందాడు.
దళితుల మీది నుంచి వీచే గాలి సోకితేనే మైలపడ్డామని భావించి అగ్ర కులస్థులు తల స్నానం చేసేవారు. దళితులు వెనుక వైపు నుంచి నడుముకి తాటాకు కట్టుకొని తమ అడుగుజాడలను తామే తుడుచుకొంటూ వెళ్లేవారు. నోటికి ముంత బిగించుకొని ఉమ్మి కింద పడకుండా జాగ్రత్త పడేవారు. ఆ రోజులు, అంత కాఠిన్యత గతించిపోయాయనే సంతోషాన్ని చొరనీయకుండా దళితుల నీడ అయినా తమ మీద పడితే సహించబోమని ఆధునిక అగ్రవర్ణ భారతం ఎలుగెత్తి ఖబడ్దార్ అంటున్నది. రాజస్థాన్‌లో ఇంద్ర మేగ్వాల్‌కు పట్టిన గతి దీనినే సూచిస్తున్నది. స్వాతంత్య్ర దిన వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సమయాన ఇంతకంటే గర్వించదగిన కారణమేముంటుంది? దేశం ఎన్నెన్ని అభివృద్ధి శిఖరాలెక్కినా సాటి మానవులను పురుగు కంటే హీనంగా చూసే కుల వివక్ష మాసిపోదని పదేపదే రుజువవుతున్నది.
దీనికి విరుగుడు లేనంత కాలం మనది ప్రజాస్వామ్యమని చెప్పుకొనే హక్కు మనకుండదు. ఇంద్ర మేగ్వాల్‌ను ఉపాధ్యాయుడు కులం పేరుతో దూషిస్తూ చితక కొట్టాడని, అతడి కుడి కన్నుకి, చెవికి తీవ్ర గాయాలై మృతి చెందాడని వార్తలు చెబుతున్నాయి. కులం పోవాలని కోరుకొనేవారు ముందుగా అన్ని కులాల వారి మధ్య సమానత్వమైనా నెలకొనాలని ఆశించాలి. ఎందుకంటే కులం ఎప్పటికీ పోయేలా లేదు కాబట్టి. అందుకే రాజ్యాంగం కూడా కుల, మత తదితర తేడాలు లేని సమాజాన్ని నెలకొల్పదలచింది. అందుకు అనుగుణమైన చట్టాలు రూపొందడానికి అవకాశం కల్పించింది. ఆ ప్రకారం ఎస్‌సి, ఎస్‌టిలపై అత్యాచారాల నిరోధక చట్టాన్ని తెచ్చారు. దాని తీవ్రతను తగ్గించాలనేవారి వాదనలోని అనౌచిత్యాన్ని ఇంద్ర మేగ్వాల్ విషాద ఉదంతం చాటి చెబుతున్నది. 1989లో తీసుకొచ్చిన ఈ చట్టం కింద గల తక్షణ అరెస్టు అవకాశాన్ని తొలగిస్తూ, నిందితులకు ముందస్తు జామీను వీలును కల్పిస్తూ 2018 మార్చిలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
పౌర సమాజం ఒత్తిడి మేరకు దాని ప్రభావాన్ని తొలగిస్తూ అదే సంవత్సరం కేంద్రం చట్టానికి సవరణ తెచ్చింది. సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం దానిని ధ్రువపరచింది. అయితే చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా, వాటి కింద శిక్షలు పడుతున్నా దేశంలో దళితులపై, మహిళలపై దుర్మార్గాలు ఆగడం లేదు. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా మహిళలపై దారుణాలు తరచూ సంభవిస్తూ ఉండడమే ఇందుకు ప్రబల నిదర్శనం. ఎస్‌సి, ఎస్‌టిలపై అత్యాచారాల నిరోధక చట్టం కింద శిక్షలు మాత్రం చాలా అరుదుగా పడుతున్నాయి. అదే సమయంలో అత్యాచారాలు పెరుగుతున్నాయి. ఎస్‌సి, ఎస్‌టిలపై అత్యాచారాలు గత చరిత్రకాదని, ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయని, బాధితులు తప్పుడు ఫిర్యాదులు దాఖలు చేస్తున్నందువల్ల కాక, దర్యాప్తు లోపాలవల్ల మాత్రమే చాలా కేసులు కొట్టివేతకు గురి అవుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
బలహీనవర్గాలు, దళితులపై జరిగే అకృత్యాలు, అత్యాచారాల కేసుల్లో దర్యాప్తులు సవ్యంగా జరగవు. పోలీసులు సైతం అగ్రకుల స్వభావంతోనే వ్యవహరిస్తారు. సమాజంతో బాటు, దర్యాప్తు వ్యవస్థలు, న్యాయస్థానాలు కూడా దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయా అనే అనుమానానికి అవకాశం కలుగుతున్నది. దేశాన్ని నడిపిస్తున్న పాలకులు దళితులపై అత్యాచారాలను, దుర్మార్గాలను తరచూ ఖండించాలి. సమానత్వం, సౌభ్రాత్రం అని సాధారణీకరించి మాట్లాడడానికి బదులు దళితులపై నేరాలను ఉన్నత పదవులలోనివారు స్పష్టంగా ప్రస్తావించి, వాటిని సహించబోమని హెచ్చరించాలి. స్వాతంత్య్ర దిన, రిపబ్లిక్ డే ప్రసంగాల్లో రాష్ట్రపతి, ప్రధాని వంటివారు కుల వివక్షను దుయ్యబట్టాలి. అయితే హిందూత్వను నెత్తినబెట్టుకొని ఊరేగే భారతీయ జనతా పార్టీ పాలకులు అందులో అంతర్భాగమైన కుల వివక్షను నోరు విప్పి గట్టిగా ఖండిస్తారని ఆశించలేము. మత భావనే కులం పునాదులపై నిర్మితమైందని డాక్టర్ అంబేడ్కర్ అన్నారు. మతాన్ని తిరస్కరిస్తేగాని కులం పోదు అని చెప్పారు. ఇది బిజెపి పాలకుల చెవికెక్కుతుందా?