Wednesday, January 22, 2025

ఇజ్రాయిల్ టెక్నాలజీతో అధికోత్పత్తులు సాధ్యం

- Advertisement -
- Advertisement -

హర్టీకల్చర్ వర్శటీ విసి డా. బి.నీరజ

హైదరాబాద్ :  ఉద్యాన పంటల సాగులో ఇజ్రాయిల్ టెక్నాలజీని పాటిస్తే అధిక ఉత్పత్తులు సాధ్యపడతాయని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.నీరజా ప్రభాకర్ వెల్లడించారు. తక్కువ నీటివనరులు ,కొద్దిపాటి భూములలో ఆధునిక పద్దతుల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తూ అత్యధిక ఉత్పాదకత ,నాణ్యతను ఇజ్రాయిల్ రైతులు సాధించగలుతున్నట్టు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ హనుమంతరావు ఆధ్వర్యంలో వివిధ జిల్లాలనుంచి పలువురు వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమితి బాధ్యులు, శాస్తవేత్తలు మూడు రోజులుగా ఇజ్రాయెల్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా విసి డా.నీరజా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రత్యేకించి రక్షిత సాగు లో భాగంగా హరిత గృహాల కింద ఇజ్రాయిల్ లో సాగు చేయబడుతున్న కూరగాయలు నాణ్యత విషయంలో, ఉత్పాదకత విషయంలో ప్రపంచానికి ఆదర్శమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పటికే భారీ సబ్సిడీతో రైతులకు ఇచ్చిన హరితగృహాల్లో సాగు ద్వారా మరిన్ని లాభాలు పొందేందుకు అవసరమైన మెలకువలు ఇజ్రాయిల్ పర్యటన ద్వారా పనికి వస్తాయని తెలిపారు.

ఇజ్రాయిల్ తరహా కూరగాయల సాగుపై తెలంగాణ రాష్ట్ర రైతులకు , మేళకువలు అందిస్తామని ఆమె తెలిపారు.పర్యటనలో భాగంగా డాక్టర్ నీరజా ప్రభాకర్ ప్రత్యేకించి అవకాడో, దక్షిణ ఇజ్రాయిల్ లోని ద్రాక్ష , అలాగే ఉత్తర ఇజ్రాయిల్ లోని దానిమ్మ తోటలను క్షుణ్ణంగా పరిశీలించారు. వివిధ కూరగాయలు, తోట పంటల్లో ఇజ్రాయిల్ దేశం పాటిస్తున్న మెకనైజేషన్, సాగులో ఉన్న వంగడాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత కలిగిన వంకాయ , నిమ్మ ఉత్పత్తిలో రైతుల అనుభవాలను,వారు పాటిస్తున్న శాస్త్రీయ మెళకులను సేకరించామని వైస్ చాన్సలర్ డా.నీరజా ప్రభాకర్ పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News