Monday, December 23, 2024

ఢిల్లీలో రోజుకు 3 రేప్ కేసులు

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో సగటున రోజుకు 3 రేప్ కేసులు నమోదు అవుతూ భారత మహానగరాల్లో అత్యంత అసురక్షిత నగరం (మోస్ట్ అన్‌సేఫ్ సిటీ)గా నిలవడం విచారకరం. గత ఆదివారం 3, 2023 డిసెంబర్‌న నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) విడుదల చేసిన క్రైమ్ ఇన్ ఇండియా -2022 నివేదికలో (36 రాష్ట్రాలు/ యుటిల వివరాలు) పలు ఆశ్చర్యకర, ప్రమాదకర అంశాలు బయటపడ్డాయి. 2021 వివరాలతో పోల్చితే 2022లో మహిళలపై అత్యాచారాలు 4 శాతం పెరిగాయని తేల్చడం అత్యంత విచారకరం. 2022లో దేశ వ్యాప్తంగా 4.45 లక్షల క్రిమినల్ కేసులు నమోదైనట్లు వెల్లడైంది. పిల్లలు, ఎస్‌సి, ఎస్‌టిల పైననే కాకుండా సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నట్లు విదితమవుతున్నది. 2021లో ప్రతి లక్ష జనాభాలో 64.5 శాతం నుంచి 2022లో 66 శాతానికి నేరాలు పెరిగినట్లు విశ్లేషించారు. 2021లో మహిళల పట్ల 43,414 కేసులు నమోదు కాగా, 2022లో 12.3 శాతం వరకు పెరుగుతూ 48,755 కేసులు రికార్డయ్యాయి. మహిళలపై భర్తల అత్యాచారాలు 31.4 శాతం, కిడ్నాప్‌లు 19.2 శాతం, దాడి కేసులు 18.7 శాతం, మానభంగాలు 7.1 శాతం నమోదు అయ్యాయి.

మహిళలపై అత్యాచారాలు, హత్యలు
భారత దేశ యుపి రాష్ట్రంలో అత్యధికంగా మహిళల పట్ల 65,743 కేసులు, మహారాష్ట్రలో 45,331 కేసులు, రాజస్థాన్‌లో 45,058 కేసులు బయటపడ్డాయి. మహా నగరాల జాబితాలో ఢిల్లీలో (ప్రతి లక్ష జనాభాలో మహిళలపై 187 హింసాత్మక కేసులు) 14,158 కేసులు, ముంబాయిలో 6,176 కేసులు, బెంగళూరులో 3,924 కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా 2022లో 31,516 రేప్ కేసులు నమోదు కాగా, అందులో 5,399 కేసులు రాజస్థాన్‌లో, 3,690 కేసులు యుపి లో, 3,029 కేసులు ఎంపిలో, 2,904 కేసులు మహారాష్ట్రలో, 1,787 కేసులు హర్యానాలో నమోదయ్యాయి. మానభంగాలతో పాటు హత్య కూడా చేసిన కేసుల్లో యుపిలో 62 కేసులు, ఎంపిలో 41 కేసులు నమోదైనాయి.

18 ఏండ్ల లోపు పిల్లలపై నేరాలు
2021లో 1,49,404 కేసులు నమోదు కాగా, 2022 లో బాలలపై 8.7 శాతం వరకు పెరుగుతూ మొత్తం 1,62,449 కేసులు నమోదు కావడం గమనార్హం.పిల్లల వ్యతిరేక నేరాల్లో 45.7 శాతం కిడ్నాపింగ్, 39.7 శాతం రేప్ కేసులు వున్నాయి. పిల్లలపై నేరాల నమోదులో మహారాష్ట్ర అత్యధికంగా 20.762 కేసులు, ఎంపిలో 20,415 కేసులు, యుపిలో 18,682 కేసులు నమోదు అయ్యాయి. పోక్సో చట్టం కింద యుపిలో 7,955 కేసులు, ఢిల్లీలో 1,529 కేసులు, ముంబైలో 1,195 కేసులు నమోదైనాయి. 2021లో 31,170 జువెనైల్ (బాలల) కేసులు నమోదు కాగా, 2022లో 2 శాతం తగ్గుతూ 30,555 కేసులు నమోదు కావడం జరిగింది.

విద్యార్థుల హత్య కేసులు
2022లో మొత్తంగా 28,522 హత్య కేసులు (ఎఫ్‌ఐఆర్) నమోదవుతూ రోజుకు సగటున 78 హత్యలు, గంటకు సగటున 03 హత్యలు జరిగినట్లు తేలింది. హత్య కేసుల్లో 9,962 కేసులు వివాదాలతో, 3,761 హత్య కేసులు వ్యక్తిగత పగ / ప్రతీకారాలతో జరిగినట్లు తేల్చారు. హత్య కేసుల్లో 70 శాతం పురుషులున్నారు. హత్య కేసుల్లో 8,125 మహిళలు, 09 మంది థర్డ్ జెండర్ వ్యక్తులూ వున్నారు.
ఎస్‌సి, ఎస్‌టిలపై కేసులు
2021తో (50,900) పోల్చితే ఎస్‌సిలపై 2022లో 13.1 శాతం వరకు (57,582) పెరగడం, ఎస్‌టిలపై (8,802 నుంచి 10,064 వరకు పెరగడం) 14.3 శాతానికి పెరిగాయి.ఎస్‌సి కేసుల్లో అత్యధికంగా యుపి 15,368 కేసులు నమోదు కావడం, రాజస్థాన్‌లో 8,724 కేసులతో ద్వితీయ స్థానంలో నిలిచాయి. మహానగరాల జాబితాలో లక్నోలో 420 కేసులు, జైపూర్‌లో 381 కేసులు, కాన్పూర్‌లో 376 కేసులు, బెంగళూరులో 231 కేసులు, అహ్మదాబాదులో 189 కేసులు, ఢిల్లీలో 129 కేసులు ఎస్‌సిలకు వ్యతిరేకంగా నేరాలు నమోదు అయ్యాయి.

2021లో 52,974 సైబర్ నేరాల కేసులు నమోదు కాగా, 2022లో 24.4 శాతం పెరిగి 65,893 కేసులు నమోదయ్యాయి. సైబర్ కేసుల్లో 64.8 శాతం ఫ్రాడ్ కేసులు, 5.5 శాతం ఆర్థిక దోపిడీ కేసులు, 5.2 శాతం లైంగిక నేరాలు నమోదు అయ్యాయి. సైబర్ నేరాల జాబితాలో తెలంగాణ అగ్ర భాగాన 15,297 కేసులతో, కర్నాటకలో 12,556 కేసులతో, యుపిలో 10,117 కేసులతో తొలి మూడు స్థానాలు ఆక్రమించాయి. సైబర్ నేరాల్లో బెంగళూరులో 9,940 కేసులు, ముంబైలో 4,724 కేసులు, హైదరాబాదులో 4,436 కేసులు నమోదు అయ్యాయి. సైబర్ నేరాలు ఢిల్లీలో 6,985 మాత్రమే నమోదు కావడం విశేషం.

ప్రమాద కారణ, ఆత్మహత్యల మరణాలు:
2022లో దేశ వ్యాప్తంగా 56,653 సడెన్ డెత్స్, 32,410 గుండె పోటు మరణాలు, 24,243 ఇతర కారణ మరణాలు నమోదు అయ్యాయి. అత్యధికంగా 45 60 ఏండ్లలోపు వయసున్నవారు 19,456 మంది మరణించడం గమనార్హం. 2021లో 1,64,033 ఆత్మహత్యలు జరుగగా, 2022లో 1,70,924 ఆత్మహత్యలు నమోదు అయ్యాయి. అదే విధంగా ప్రమాద మరణాలు 3,97,530 నుంచి 4,30,504కు పెరిగాయి. 2022లో 10,295 పిల్లలు (5,588 బాలురు, 4,616 బాలికలు) ఆత్మహత్యలు చేసుకోగా, 2,095 మంది పరీక్షల్లో వైఫల్యాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నట్లు విదితమవుతున్నది. 2022 ఆత్మహత్యల్లో 7.6 శాతం విద్యార్థులే ఉండడం గమనించారు. ఆత్మహత్యల్లో మహారాష్ట్ర (378), ఎంపి (277), జార్ఖండ్ (174), కర్నాటక (162), గుజరాత్ (155) రాష్ట్రాలు ముందున్నాయి. నేరాలు, హింసాత్మక ఘటనలు, మానభంగాలు, ఆత్మహత్యలు, నిమ్నవర్గాలపై కేసులు లాంటివి అనాగరిక సమాజ లక్షణాలని తలచి, నేరాలు నమోదు కాని నేర రహిత సమాజాన్ని నెలకొల్పడంలో ప్రతి ఒక పౌరుడు తన వంతు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కోరుకుందాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News