న్యూఢిల్లీ : గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 16.49 లక్షల మందికి వైరస్ పరీక్షలు చేయగా కొత్తగా 2,38,018 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,76,18,271 కు చేరుకుంది. ఇందులో ఒమిక్రాన్ కేసులు 8,891 వరకు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. గత 230 రోజుల తరువాత యాక్టివ్ కేసుల సంఖ్య అత్యధికంగా 17,36,628 కు చేరుకోవడం ఆందోళన కలిగించే విషయం.గత 24 గంటల్లో యాక్టివ్ కేసులు 80,287 వరకు అధికంగా నమోదయ్యాయి. తాజాగా 310 మంది కరోనాతో మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 4,86,761 కు చేరింది. సోమవారం నుంచి ఒమిక్రాన్ కేసుల్లో 8.31 శాతం పెరుగుదల కనిపించింది. ప్రతి నమూనాకు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించడం సాధ్యం కాదని, కానీ ప్రస్తుత వేవ్ ఒమిక్రాన్ వేరియంట్ వల్లనే కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మొత్తం ఇన్‌ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 4.62 శాతం ఉంటాయని , జాతీయ స్థాయిలో రికవరీ రేటు 94.09 కి తగ్గిందని ఆరోగ్యమంత్రిత్వశాఖ వివరించింది. వీక్లీ పాజిటివిటీ రేటు 14.92 శాతం వరకు నమోదు కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 14.43 శాతంగా నమోదైంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,53,94,882 కు పెరగ్గా, మరణాల రేటు 1.29 శాతంగా నమోదైంది. మరణాల్లో 70 శాతం ఇతర వ్యాధుల వల్లనే అని కేంద్ర మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు దేశంలో డోసుల పంపిణీ 158.04 కోట్లను అధిగమించింది. 1518 ఏళ్ల వారిలో 3.59 లక్షల మందికి తొలి డోసు టీకాలను అందించారు. ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసు పంపిణీ చేశారు.