Monday, January 20, 2025

ఆశలు రేకెత్తిస్తున్న వర్షాలు !

- Advertisement -
- Advertisement -

హైదారాబాద్: రాష్ట్రంలో వర్షాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి వాతావరణం అనుకూలంగా మారుతోంది. రాష్ట్రంలో ఈ నెల ఇప్పటివరకూ అధిక వర్షపాతం నమోదు వ్యవసాయంతోపాటు అన్ని రంగాలకు భరోసా కల్పిస్తోంది. నైరుతి రుతుపవనాల సీజన్‌కు సంబంధించి 720.4మి.మి వర్షపాతం నమోదు కావాల్సివుంది. అయితే అందులో జులై నెలకు సంబంధించి 229.1మి.మి వర్షపాతం నమోదు కావాల్సివుండగా , అందులో ఈ సమయానికి 25.5 మి.మి వర్షపాతం నమోదు కావాలి. జులై తొలివారంలో ఇప్పటికే 32.9మి.మి వర్షపాతం నమోదు జరిగింది. జూన్‌లో లోటు వర్షపాతాన్ని పూరించేందకు ఇది కొంత దోహదపడుతోందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. గత నెలలో 22నుంచే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి.

జూన్‌లో 129మి.మి వర్షపాతం నమోదు కావాల్సివుండగా, రుతుపవనాలు ఆ నెల అంతా కలిపి కేవలం 72.6మిల్లిమీటర్ల తోనే సరిపెట్టాయి. దీంతో వర్షాకాలం ప్రారంభంలోనే జూన్‌లో 44శాతం లోటు వర్షపాతం ఏర్పడింది. ఈ నెల ప్రారంభం నుంచి వర్షాల పరిస్థితి కొంత మెరుగుపడింది. ఇది వర్షాకాలంలో ఉన్న 44శాతం లోటు వర్షపాతాన్ని 32శాతానికి తగ్గించగలిగింది. రాష్ట్రంలో వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్ జిల్లాలు అధికవర్షపాతం జిల్లాల జాబితాలోకి చేరిపోయాయి. జగిత్యాల , ములుగు , జయశంకర్ భూపాలపల్లి, జిల్లాల్లో కూడా వర్షపాతం మెరుగు పడింది. మెదక్ , సిద్దిపేట, జనగాం, రంగారెడ్డి, మేడ్చెల్, మహబూబ్ నగర్ , నాగరకర్నూల్, నల్లగొండ, జోగులాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ జిల్లాల్లో కూడా వర్షపాతం సాధారణ పరిస్థితికి చేరింది.

లోటులో 16జిల్లాలు
తెలంగాణలో సగం రాష్ట్రం ఇంకా వేసవి ఛాయల నుంచి బయట పడలేకపోతోంది. 16జిల్లాలు ఇంకా లోటు వర్పపాతంలోనే బిక్కుబిక్కు మంటున్నాయి. అదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, నిర్మల్ , నిజాబామాబద్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ ,ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, సూర్యాపేట జిల్లాలు లోటు వర్షపాతంలో వున్నాయి.

తెలంగాణకు భారీ వర్షసూచన
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం గంగటిక్ పశ్చిమ బెంగాల్ పరిసరరాలలోని ఉత్తర ఒడిస్సా దగ్గర సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 7.6 కి.మి ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపునకు వంగివుంది. గురువారం తూర్పు పశ్చిమ ద్రోణి (షీర్‌జోన్) సగటు సముద్ర మట్టానికి 4.5నుండి 7.6కి.మి ఎత్తు మధ్య కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల 24గంటల్లో రాష్ట్రంలోని తూర్పు జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు , మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

నీల్వాయ్‌లో 63 మి.మి వర్షం:
రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా నీల్వాయ్‌లో 63 మి.మి వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో మాల్యాలపల్లిలో 52, దేవులవాడలో 50.3, కుండారంలో 40.3, రైలిలో 38.8, కొల్లూరులో 35.3, నాస్పూర్‌లో 33.8, ఎండపల్లిలో 33.5, రామగుండంలో 33.3 మి.మి చొప్పున వర్షం కురిసింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News