ఆర్మీపైలట్లలో అత్యధికస్థాయిలో క్యాన్సర్ కేసులు కనిపిస్తున్నాయని పెంటగన్ అధ్యయనం వెల్లడించింది. వీరిలో నేలపై ఉండి ఇంధనం నిర్వహణలో పనిచేసే సిబ్బందిని ఈ అధ్యయనంలో మొదటిసారి చేర్చారు. 1992 నుంచి 2017 మధ్యకాలంలో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్‌ల్లో నేలపై ఇంధన నిర్వహణలో పనిచేసిన, విహరించిన దాదాపు 9,00,000 మంది సిబ్బందిని ఈ అధ్యయనంలో తీసుకున్నారు.
పెంటగన్ ఈ అధ్యయనంలో వైమానిక సిబ్బందిలో 87 శాతం చర్మక్యాన్సర్, 39 శాతం థైరాయిడ్ క్యాన్సర్, పురుషుల్లో 16 శాతం ప్రోస్టేట్ క్యాన్సర్, మహిళల్లో 16 శాతం రొమ్ముక్యాన్సర్ ఉన్నట్టు బయటపడింది. మొత్తం మీద వైమానిక సిబ్బందిలో అన్ని రకాల క్యాన్సర్ 24 శాతం వరకు ఉంది. క్షేత్రస్థాయి సిబ్బందిలో అత్యధిక స్థాయిలో బ్రెయిన్, నెర్వస్ క్యాన్సర్, 15 శాతం థైరాయిడ్ క్యాన్సర్, 9 శాతం కిడ్నీ, లేదారీనల్ క్యాన్సర్ మహిళల్లో 7 శాతం రొమ్ముక్యాన్సర్ కనిపించింది.
మొత్తం మీద అన్ని రకాల క్యాన్సర్ల రేటు 3 శాతం వరకు ఎక్కువగా ఉంది. కొంత మంచి పరిణామాలు కూడా కనిపించాయి. నేలపై పనిచేసేవారిలోనూ, విమానాల్లో ఎగిరేవారి లోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్ స్థాయిలు చాలా తక్కువగా ఉండటం గమనార్హం. అలాగే వైమానిక సిబ్బందిలో మూత్రాశయ క్యాన్సర్, పేగు క్యాన్సర్ చాలా తక్కువ స్థాయిలో కనిపించాయి. అమెరికా లోని సాధారణ జనాభాతో సర్వీసి సిబ్బంది డేటాను పోల్చిచూసి అధ్యయనం చేశారు. ఇప్పుడు చేపట్టిన కొత్త అధ్యయనం చాలా సమగ్రమైన భారీ స్థాయి సర్వేగా పెంటగన్ వివరించింది.
ఇదివరకు అధ్యయనంలో కేవలం ఎయిర్‌ఫోర్సు పైటట్లనే తీసుకున్నారు. వీరిలో అత్యధిక స్థాయిల్లో క్యాన్సర్ కనిపించింది. ఇప్పుడు ఎయిర్, గ్రౌండ్ సిబ్బంది అందర్నీ అధ్యయనం చేశారు. భారీ ఎత్తున విస్తారంగా అధ్యయనం ఇప్పుడు చేపట్టినప్పటికీ, డేటాలో ఖాళీల వల్ల వాస్తవ క్యాన్సర్ కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని పెంటగన్ హెచ్చరించింది. 2021లో రక్షణరంగానికి సంబంధించిన బిల్లు కోసం కాంగ్రెస్‌కు అధ్యయనం అవసరమైంది.
ఇప్పుడు అత్యధిక రేట్లలో క్యాన్సర్ కేసులు బయటపడినందున ఎందుకు రక్షణ దళాలు తీవ్ర అస్వస్థతకు గురౌతున్నారో పూర్తిగా తెలుసుకోడానికి పెంటగన్‌కు మరింత విస్తారంగా సమగ్రమైన అధ్యయనం నిర్వహించడం తప్పనిసరి. వ్యాధికి గల సంభావ్య కారణాలను వేర్వేరుగా చేసి చెప్పడం కష్టం. పెంటగన్ జాగ్రత్తగా దీన్ని పరిగణన లోకి తీసుకొంటోంది. ఈ అధ్యయనం కేవలం మిలిటరీ సర్వీస్ లోని వైమానిక, లేదా పదాతి దళాలకు మాత్రమే క్యాన్సర్ సోకుతుందన్న అభిప్రాయం కలిగించడానికి కాదని స్పష్టం చేసింది. ఎందుకంటే క్యాన్సర్ సోకడానికి అనేక కారణాలు ముడిపడి ఉంటాయి.
కుటుంబ చరిత్ర, ఆల్కహాలు సేవించడం తదితర అంశాలను కూడా పరిగణన లోకి తీసుకోవాలి. కానీ వైమానిక దళాలపై పర్యావరణ ప్రభావాలు బాగా పనిచేస్తుంటాయి. జెట్ విమానాల ఇంధనాల నుంచి వెలువడే పొగ దుమ్ము ధూళి, జెట్ విభాగాల నిర్వహణ, శుద్ధి వంటి పనులకు వినియోగించే ద్రావకాలు ఆరోగ్యంపై విపరీత ప్రభావం చూపిస్తాయి. ఈ అధ్యయనానికి వినియోగించిన మిలిటరీ హెల్త్ సిస్టమ్ డేటా 1990 వరకు విశ్వసనీయమైన క్యాన్సర్ డేటా సమకూర్చలేదు. అందువల్ల ముందు తరాల్లో ఎవరైతే జెట్ విమానాల్లో పనిచేశారో వారిని ఇందులో చేర్చడం కుదరక పోవచ్చునని పెంటగన్ అభిప్రాయపడుతోంది.