Saturday, April 12, 2025

బుద్ధగయపై ఎందుకీ రాద్ధాంతం?

- Advertisement -
- Advertisement -

బౌద్ధ సాంప్రదాయంలో బుద్ధ గయకు విశిష్టమైన స్థానమున్నది. ప్రపంచాన్ని ఆయుధాలతో కాకుండా ఆశయాలతో సమత, మమత, కరుణలతో జయించిన మతం బౌద్ధం. అటువంటి మహోన్నత మతానికి బుద్ధ గయ తో విడదీయరాని బంధమున్నది. గౌతమ బుద్ధుడు సత్యాన్వేషణ కోసం తిరిగి తిరిగి ఈ నేలన చేరి తన మార్గాన్ని కనుగొన్నది ఇక్కడే. ఇది అందరికీ తెలిసిందే. సామ్రాట్ అశోకుడు తాను బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత బౌద్ధం విస్తరించిన నేలలో అనేక చోట్లలో తన స్థూపాలను నిర్మించాడు. అందులో బుద్ధుడు జన్మించిన లుంబిని మొదలుకొని మహాపరి నిర్వాణం పొందిన కుషినారా (నేటి కుషి నగర్) వరకు 84 వేల స్థూపాలను స్థూపాలను నిర్మించినట్టు శిలా శాసనం ద్వారా తెలుస్తున్నది.

నిజానికి బౌద్ధం మరొకసారి ప్రపంచమంతా విస్తరిస్తున్నదంటే ఈ స్థూపాల ఆధారమే ప్రధానం. ఒకవేళ అశోకుడు ఆ రోజు స్థూపాల నిర్మాణం జరిపి ఉండకపోతే బౌద్ధాన్ని కట్టుకథలని తేల్చి వేసేవారు. అటువంటి స్థూపాలు, శిలా శాసనాలలో భాగమే బుద్ధ గయ స్థూపం. అందుకే కట్టుకథ కాదు. కల్పితం కాదు. బుద్ధ గయ గౌతమ బుద్ధుడు నిరంజన నది ఒడ్డున ఉన్న బోధి వృక్షం కింద ఎన్నో రోజులు దీర్ఘ చింతనలో ఉండి, తాను అన్వేషిస్తున్నసత్యాన్ని కనుగొన్నట్టు మనకు చరిత్ర ఆధారాలున్నాయి. అప్పటి వరకు అక్కడ ఎటువంటి మతాలు, దేవుళ్లు ఉన్నట్టు ఎటువంటి పురాతత్వ, చారిత్రక ఆధారాలు లేవు. అంటే బుద్ధ గయ బౌద్ధుల ఆరాధన స్థలం.

ఇందులో ఎటువంటి వివాదం లేదు. అయితే బుద్ధ గయ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప దర్శనీయ స్థలం. ఏటా కొన్ని లక్షల మంది బుద్ధ గయను సందర్శిస్తుంటారు. అయితే ఈ రోజు బుద్ధ గయ మరొక సారి చర్చలోకి వచ్చింది. గత రెండు నెలలకు పైగా బౌద్ధ సంఘాలు, బౌద్ధ బిక్కులు బుద్ధ గయ బౌద్ధులదే అంటూ, ఇది ఇతరుల పాలనలలో అంటే ఇతరుల జోక్యంతో కొనసాగకూడదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. బుద్ధ గయ అంటే మొత్తం పట్టణం కాదు. బుద్ధ గయలో ఉన్న మహాబోధి బౌద్ధాలయం ఇతరుల అజమాయిషిలో ఉండకూడదని ఆ సంఘాలు వాదిస్తున్నాయి.

అయితే చరిత్రలో బుద్ధ గయలోని బుద్ధునిస్థలం, బోధి వృక్షం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నది. అన్నింటిని తట్టుకొని ప్రపంచమంతటినీ ఆకర్షిస్తున్నది. సామ్రాట్ అశోకుడు బుద్ధ గయలో ఇప్పుడు ఉన్న స్థలాన్ని గుర్తించి ఇది గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన స్థలంగా ప్రకటించి ఇక్కడ బౌద్ధ రామాన్ని, స్తంభాలను నిర్మించాడు. దానితో ఇది గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన స్థలంగా చరిత్రలోకెక్కింది. గౌతమ బుద్ధుడు ఆసీనుడైన స్థలంలో ఉన్న బోధి వృక్షం నుంచి వేరు చేసిన కొమ్మ నుంచి మళ్లీ వెలిసిన చెట్టుగానే భావిస్తున్నారు. ఎందుకంటే అనేక సార్లు ఈ చెట్టు నరికివేతకు గురైంది. హిందూ మత పెద్దలు, ముస్లిం పాలకులు, రాజులు అనేక సార్లు ఈ ప్రదేశాన్ని రకరకాలుగా విధ్వంసానికి గురి చేశారు.

బౌద్ధం క్రమక్రమంగా వెనుక తగ్గిన కొద్దీ ఈ ప్రదేశం కూడా నిరాధరణకు గురైంది. ఆ తర్వాత కొద్ది మంది మహాబోధి బౌద్ధ ఆలయంలో, ఆవరణలో ఒక శివ లింగాన్ని స్థాపించి తమ పూజలను నిర్వహించడం మొదలుపెట్టారు. అయితే మళ్లీ ఇది తెర మీదికొచ్చింది. బౌద్ధ ఆచార్యుడు అనాగారిక ధర్మపాల ఉద్యమం తర్వాతనే.1891 లో మొదటిసారిగా అనాగారిక ధర్మపాల బుద్ధ గయను సందర్శించారు. అప్పటికి పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఎటువంటి ఆదరణ లేదు. ఆ స్థలంలో ఎన్నో చారిత్రక అవశేషాలు ఉన్నప్పటికీ హిందూ మఠాధిపతులు అక్కడ హిందూ సాంప్రదాయంలో పూజలు నిర్వహిస్తుండేవారు. ఎటువంటి బౌద్ధ మత సాంప్రదాయాలు లేవు. బౌద్ధలకు అక్కడ స్థానం లేదు. అయితే అనాగారిక ధర్మపాల అక్కడ బౌద్ధాన్ని మళ్లీ ప్రతిష్టింప చేసేందుకు గొప్ప ఉద్యమం చేయాల్సి వచ్చింది. అనాగారిక ధర్మపాల శ్రీలంకకు చెందిన బౌద్ధ ఆచార్యుడు.

ఆయన 1864లో శ్రీలంకలోని బౌద్ధుల కుటుంబంలో జన్మించారు. ఆయన క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్న రోజుల్లో పాశ్చాత్య బౌద్ధ తాత్వికులు మేడమ్ బ్లవట్‌స్కి, కలొనల్ ఒల్‌కోల్‌లతో ధర్మపాల స్ఫూర్తి పొందారు. ఈ ఇద్దరు న్యూయార్క్‌లో థియో సొఫికల్ సొసైటీని స్థాపించారు. ఆ సంస్థ ద్వారా 300కు పైగా బౌద్ధ పాఠశాలలను నిర్మించారు. వారి స్ఫూర్తితో అనాగారిక ధర్మపాల బౌద్ధం కోసం తన జీవితాన్ని అంకితం చేయాలనుకున్నారు. ముందుగా ఆయన బుద్ధ గయను సందర్శించారు. 1885లో మొదటిసారి ప్రముఖ బౌద్ధ రచయిత లైట్ ఆఫ్ ఆసియా పుస్తక రచయిత సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్‌తో కలిసి బుద్ధ గయ వచ్చారు. ఆ తర్వాత ధర్మపాల ప్రపంచమంతా పర్యటించి మళ్లీ 1891లో బుద్ధ గయ వచ్చారు. అయితే ఒక యాత్రికుడిగా కాకుండా, ఒక ఉద్యమ సారథిగా ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు.

తన కార్య స్థలం బుద్ధ గయని, తన నివాస స్థలం కలకత్తాగా నిర్ణయించుకున్నారు. అప్పటి వరకు బుద్ధ గయ హిందువుల ఆధీనంలోనే ఉండేది. దానిని విముక్తి చేయడానికి తన పోరాటాన్ని మొదలు పెట్టారు. హిందూ పూజారుల ఆధీనంలో నుంచి బుద్ధ గయ బౌద్ధాలయాన్ని విముక్తి చేయాలని, దానిని బౌద్ధులకు అప్పగించాలని ఆయన కోర్టులో దావా వేశారు. కాని ఆయన తన పోరాటంలోనే పరి నిర్వానం పొందారు. 1933లో ధర్మపాల కన్నుమూసిన తర్వాత ఆ ఉద్యమం మరింత ముందుకు పోయింది. ఆయన స్థాపించిన మహా బోధి సొసైటికి 1949లో కొంత స్థలాన్ని అప్పగించారు. ఇప్పుడు మనం దర్శిస్తున్న స్థలం అట్లా మిగిలి ఉందంటే అది కేవలం ఆనాగారిక ధర్మపాల విజయమే.

1949లో అప్పటి ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. దానితో కొంత ఊరట లభించింది. బౌద్ధులకు మొదటిసారిగా మహాబోధి బౌద్ధాలయం మీద హక్కు వచ్చింది. కాని అందులో మరో మెలిక పెట్టారు. ఈ మహా బోధి బౌద్ధాలయాన్ని నిర్వహించడానికి ఒక కమిటీ ఉంటుందని అందులో నలుగురు బౌద్ధులు, నలుగురు హిందువులు, జిల్లా కలెక్టర్ ఎక్స్ అఫీసియో సభ్యులుగా ఉంటారనేది చట్టం. దీనిని బౌద్ధులు సంపూర్ణంగా అంగీకరించలేదు. కాని పాక్షికంగానైనా తమకు స్థలం మీద హక్కు లభించిందని భావించారు. అయితే ఇటీవల బౌద్ధులు తమ స్థలం మీద తమకు మాత్రమే పూర్తి హక్కు, అజమాయిషి ఉండాలని వాదిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమ లక్షం అదే. కాని ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి. పైగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అనేక బౌద్ధ బిక్కులను నిర్బంధిస్తున్నారు.

ఎటువంటి కార్యకలాపాలు చేయకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ఇక్కడే మన ప్రభుత్వ పెద్దల ద్వంద్వ నీతి కనిపిస్తున్నది. బాబ్రీ మసీదును వివాదం చేసి దానిని కూల్చి దాని కింద ఎటువంటి రాముడి ఆనవాళ్లు లేకున్నా రామాలయాన్ని నిర్మించారు. వాళ్లకు అనుకూలంగా జిల్లా న్యాయస్థానం నుంచి మొదలుకొని సుప్రీం కోర్టు వరకు తమకు అనుకూలమైన తీర్పులు ఇప్పించుకోగలిగారు. నిజానికి బాబ్రీ మసీదు కింద దొరికిన ఆనవాళ్లు బౌద్ధానివి. సాహిత్యంలో కూడా బౌద్ధం మాత్రమే అయోధ్యలో ప్రబలంగా ఉండేదని ఖచ్చితమైన ఆధారాలు లభించాయి. కాని ఎవ్వరూ పట్టించుకోలేదు. కొంత మంది బౌద్ధులు సుప్రీం కోర్టుకు వెళ్ళినా కూడా అరణ్య రోదనగానే మిగిలిపోయింది.

అయితే బుద్ధ గయలో అట్లా కాదు. అక్కడ బౌద్ధం ఆధారాలు, నిర్మాణాలు తప్ప మరేవి లేవు. కేవలం ఒక చిన్నశివ లింగాలను చూపెట్టి ఇది హిందువులది, బౌద్ధులది అంటూ సూత్రీకరణలు చేస్తున్నారు. ఆ శివలింగ క్రీ.శ పదవ శతాబ్దం నాటిదని నిపుణులు చెబుతున్నారు. ఆధారాలు లేకుండా ఆధిపత్యం ఉన్నందు వల్ల ఆలయాలు నిర్మిస్తున్నారు. అన్ని ఆధారాలున్న ఆ స్థలం మీద బౌద్ధులకు హక్కులు ఇవ్వడానికి ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, అధికార యంత్రాంగం ప్రయత్నించడం లేదు. ఇంకొక విషాదం. ప్రతి విషయం మీద తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చే ప్రజాస్వామిక వాదులు, లౌకికవాదులు బుద్ధ గయ విషయంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయడం లేదు. గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా బౌద్ధులు, బౌద్ధ సంఘాలు చేస్తున్న ఆందోళన పత్రికల దృష్టికి రాకపోవడం శోచనీయం.

– మల్లేపల్లి లక్ష్మయ్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News