- ఏటా 1.63 లక్షలు.. మూడో వంతు కుటుంబ సమస్యలతోనే
- దక్షిణాదిలో ఎక్కువ.. తెలంగాణలో 26.9%, ఏపీలో 15.3%
- కరోనా అనంతరం పెరుగుదల.. 2020లో 18-20%
- ఆసియన్ సైకియాట్రీ సదస్సులో స్నేహ సంస్థ ఫౌండర్ లక్ష్మీ
హైదరాబాద్: మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 1.63 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని ఎన్‌సిఆర్‌బి నివేదికలు చెబుతున్నాయి. అయి తే ఆ సంఖ్య 1.90 లక్షలకు పైనే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ, 2.30 లక్షల వరకు ఉంటుందని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ పేర్కొంటున్నాయి. అయినా ప్రభుత్వాలు ఉదాసీనంగానే వ్యవహరిస్తుండటం దుదరృష్టకరమని స్నేహ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ లక్ష్మీ విజయకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంస్థ ద్వారా ఆమె ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తున్నారు.
హైదరాబాద్‌లో జరుగుతున్న 9వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఆసియన్ సైకియాట్రీ రెండో రోజు సదస్సులో ఆమె మన దేశంలో ఆత్మహత్యలు, వాటి నివారణ గురించి మాట్లాడారు. ఆత్మహత్యల సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగిందని, దీనికి కొవిడ్ చూపిన ప్రభావం కూడా కారణమని చెప్పారు. ‘గతంలో ప్రపంచంలో అత్యధికంగా చైనాలో ఆత్మహత్యలు జరిగేవి. ఇప్పుడు మన దేశం నంబర్ వన్ స్థానానికి చేరింది. ఉత్తరాది కంటే దక్షిణాదిలోనే ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటున్నాయి. దేశంలో అత్యధికంగా పుదుచ్చేరిలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. గత ఏడాది విడుదలైన గణాంకాల ప్రకారం తెలంగాణలో 26.9 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 15.3 శాతం, బీహార్‌లో అతి తక్కువగా 0.70 శాతం నమోదయ్యాయి. 2019లో 10.5 శాతంగా ఉండగా ఇప్పుడు 12 శాతానికి చేరాయి. ఈ పెరుగుదలలో కొవిడ్ ప్రభావం కనిపిస్తోంది. 2019తో పోలిస్తే 2020లో 18-20 శాతం వరకు ఆత్మహత్యలు పెరిగాయి. వీటిలో పురుషులు, స్త్రీల నిష్పత్తి 2:1గా ఉంది, మన దేశంలో 15-39 సంవత్సరాల వ్యక్తుల్లో అధిక శాతం మరణాలకు ఆత్మహత్యలే కారణం ’’ అని చెప్పారు.