Wednesday, January 22, 2025

కర్నాటకలో హిజాబ్ నిషేధం ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

మైసూరు : కర్నాటకలో ముస్లిం మహిళల ముఖం ముసుగు హిజాబ్‌పై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరించింది. హిజాబ్ ధారణపై ఉన్న నిషేధాన్ని తాము ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం తెలిపారు. మైసూరులో ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడా ఈ నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని చెప్పారు. మహిళలు తాము కోరుకున్న వస్త్రదారణకు దిగే స్వేచ్ఛ ఉందని, ఇది హిజాబ్‌కు కూడా వర్తిసుందని స్పష్టం చేశారు. ఇక అధికారికంగా కూడా హిజాబ్‌పై నిషేధం ఉండబోదని తెలిపారు. మహిళలు హిజాబ్ ధరించే ఎక్కడైనా తిరగవచ్చు. అది వారి ఇష్టానికి వదిలిపెడుతున్నామని చెప్పిన సిఎం ఈ మేరకు తాము అధికార యంత్రాంగానికి ఈ నిషేధ ఎత్తివేత ఆదేశాలు వెలువరించినట్లు వివరించారు. ఆహార్యం, ఆహారం వంటి వాటిలో ఎవరిష్టం వారిది. దీనిని కట్టడిచేసే ఆలోచన అనుచితం అవుతుంది.

మీ ఇష్టానికి అనుగుణంగా ఉంటే సరిపోతుంది. దీనిపై ప్రభుత్వ అడ్డంకి ఎందుకు? అని ప్రశ్నించారు. తాను ధోవతి ధరిస్తానని, మీరు ప్యాంటు షర్టులు వేసుకుంటారని ఇందులో తప్పేముంది. తిండి బట్టలపై అభ్యంతరాలు, ఆంక్షలు కుదరవని తెలిపారు. 2022లో కర్నాటకలో బిజెపి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి బొమ్మై రాష్ట్రంలో హిజాబ్‌పై నిషేధం విధించారు. విద్యాసంస్థలకు యువతులు హిజాబ్‌తో రాకూడదని తీసుకున్న నిర్ణయం తీవ్రస్థాయ వివాదానికి దారితీసింది. దీనిపై వ్యతిరేకత వెల్లువెత్తింది. ఓ దశలో పరిస్థితి అదుపు తప్పింది. తరువాత కొందరు విద్యార్థులు హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ నిషేధాన్ని సమర్థించింది. హిజాబ్‌కు ఇస్లామిక్ మత పద్ధతులకు జోడించడం అనుచితం అని, ఇస్లామ్‌లో ఎక్కడ కూడా హిజాబ్ విధిగా పాటించాలని రాయలేదని తీర్పులో తెలిపారు. తరువాత ఈ వ్యాజ్యం సుప్రీంకోర్టుకు వెళ్లింది.

అక్కడ భిన్నాభిప్రాయాల తీర్పు వెలువడింది. ఇదమిద్ధంగా హిజాబ్ సబబా కాదా అని తేల్చలేదు. అయితే ఒక న్యాయమూర్తి తమ తీర్పులో సంబంధిత అధికార యంత్రాంగం స్కూళ్లు, కాలేజీల్లో సార్వత్రిక వస్త్రధారణ నిబంధనలు విధించవచ్చునని, దీనిని పరిపాలనా నిర్వహణ క్రమంలో పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటుందని, దీనిలో కోర్టుల జోక్యం కుదరదని తెలిపారు. కాగా మరో జడ్జి హిజాబ్ హిజాబ్ ధారణ వారివారి ఇష్టాలకు వదిలేయాల్సిన అంశం అని తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హిజాబ్ నిషేధం వంటి తిరోగమన చర్యలన్నింటిని వెనకకు తీసుకుంటామని ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News