మంగళూరు: కర్నాటకలో మళ్లీ హిజాబ్ వివాదం రాజుకుంది. యూనివర్సిటీ క్యాంపస్‌లో హిజాబ్ ధరించడానికి అనుమతించాలని కోరుతూ మంగళూరు విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు ముస్లిం విద్యార్థినులు దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ను సోమవారం కలుసుకోవడంతో ఇస్లాం సాంప్రదాయక వస్త్రధారణ వివాదం మళ్లీ ముందుకొచ్చింది. విద్యా సంస్థలలో హిజాబ్ ధరించడానికి అనుమతించాలని శనివారం మంగళూరు యూనివర్సిటీలో డిమాండు చేసిన 12 మంది విద్యార్థినులు సోమవారం కూడా క్యాంపస్‌కు చేరుకున్నారు.
విద్యార్థినులకు డ్రెస్ కోడ్ ఉండడంతో శనివారం వారిని క్యాంపస్‌లోకి అనుమతించని యూనివర్సిటీ అధికారులు సోమవారం కూడా వారిని అడ్డుకున్నారు. దీనిపై జిల్లా డిప్యుటీ కమిషనర్‌ను కలుసుకోవాలని అధికారులు సూచించడంతో విద్యార్థినులు ఆయనను కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. అనంతరం డిప్యుటీ కమిషనర్ డాక్టర్ రాజేంద్ర కెవి విలేకరులతో మాట్లాడుతూ యూనివర్సిటీ సిండికేట్ సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని తాను ప్రశ్నించలేనని చెప్పారు. యూనివర్సిటీలో డ్రెస్ కోడ్ మినహా మరే ఇతర వస్త్రాలకు అనుమతి లేదన్న సిండికేట్ నిర్ణయానికి విద్యార్థులంతా కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన చెప్పారు. దీనిపై గతంలోనే హైకోర్టు తీర్పు వెలువడినందున ఎవరూ దీన్ని సవాలు చేయడం సాధ్యం కాదని ఆయన చెప్పారు.
hijab Controversy erupts again in Karnataka