కర్నాటక మంత్రి వెల్లడి
బెంగళూరు: రాష్ట్రంలోని 75 వేల హైస్కూళ్లు, కళాశాలల్లో కేవలం ఎనిమిదిలో మాత్రమే హిజాబ్ వివాదం ఏర్పడిందని కర్నాటక ప్రాథమిక, మాధ్యమిక విద్యా శాఖ మంత్రి బిసి నగేష్ తెలిపారు. ఈ వివాదం త్వరలోనే పరిష్కారం కాగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు గతవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విద్యార్థులు కాషాయం శాలువాలు, స్కార్ఫ్‌లు, హిజాబ్ ధరించడంతోపాటు ఎటువంటి మతపరమైన పతాకాలను తరగతులలోకి తీసుకెళ్లరాదని ఆదేశించింది. అయితే, హిజాబ్, బుర్ఖా ధరించి తరగతులకు హాజరవుతామని కొందరు విద్యార్థినుల గురువారం కూడా పట్టుబట్టడంతో ఈ వివాదం సద్దుమణగడం లేదు. గురువారం విలేకరులతో మంత్రి నగేష్ మాట్లాడుతూ ఈ సమస్య కేవలం అతి స్వల్ప సంఖ్యలో కొన్ని స్కూళ్లు, కాలేజీలకే పరిమితమైందని చెప్పారు.
ఇలా ఉండగా.. బళ్లారిలోని సరళాదేవి కళాశాలలోకి బుర్ఖా ధరించిన విద్యార్థినులను అనుమతించకపోవడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కాలేజీ ముందు ధర్నా చేశారు. పోలీసులు, న్యాయవాదులు హైకోర్టు ఉత్తర్వులను చూపించి వారిని నచ్చచెప్పి అక్కడ నుంచి పంపివేశారు. బెలగావిలోని విజయ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పారా మెడికల్ సైన్సెస్ ఎదుట కొందరు వ్యిర్థులు అల్లాహో అక్బర్ అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. చిత్రదుర్గలోని మహిళా పియు కాలేజ్ వద్ద కూడా విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.