Thursday, January 23, 2025

హిజాబ్ – ఆత్మగౌరవ పతాక

- Advertisement -
- Advertisement -

NCP holds demonstration supporting hijab

‘హిజాబ్’ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినోళ్ళలో నానుతున్న పదం. కావాలని కొందరు మతోన్మాదులు వివాదాస్పదం చేసిన పదం. అసలు హిజాబ్ అంటే ఏమిటి? తలపై వస్త్రం కప్పుకోవడం. తల, మెడ, భుజాలు కవర్ చేస్తూ ఏదైనా వస్త్రాన్ని కట్టుకోవడాన్నో, చుట్టుకోవడాన్నో ‘హిజాబ్’ అంటారు. తాజాగా కర్నాటకలోని ఒక ప్రభుత్వ కళాశాలలో అకస్మాత్తుగా హిజాబ్ పై ఆంక్షలు విధించడంతో ఈ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. కళాశాలలో వందలాది మంది విద్యార్ధులు చదువుకుంటారు. అందులో ఒక ఆరేడుగురు విద్యార్ధినులు హిజాబ్ ధరించే కళాశాలకు వస్తుంటారు. కళాశాలలో చేరిన దగ్గరి నుండి ప్రతి రోజూ హిజాబ్‌లోనే వచ్చేవారు, పోయేవారు. ఉన్నట్టుండి ఎంజిఎం కళాశాల యాజమాన్యం ఒక్కసారిగా ‘మీరు హిజాబ్ తీసేసి లోపలికి రండి’ అనడంతో విద్యార్ధినులు అవాక్కయ్యారు. ‘అదేంటి సార్.. మేము మొదటినుండీ ఇలానే వస్తున్నాము కదా..’ అన్నారు విద్యార్ధినులు. ‘లేదమ్మా.. నిబంధనల ప్రకారం మీరు తలపై వస్త్రం ధరించడానికి వీల్లేదు.. వస్త్రం తీసేసి కళాశాలకు రావాలి.. లేదంటే కాలేజీకి రావద్దు’ అని ఖరాఖండిగా చెప్పడంతో వాళ్ళకేంచెయ్యాలో అర్ధం కాలేదు. ‘అదేంటండీ.. మాకు నచ్చిన బట్టలు మేము వేసుకుంటే మీకు నష్టమేమిటి? మేము మొదట్నుండీ ఇలానే వస్తున్నాము కదా.. మా వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే చెప్పండి’ అని వారు ప్రశ్నించారు. అయినా అమ్మాయిల్ని అనుమతించకుండా తిప్పి పంపించారు. మరునాడు తల్లిదండ్రులు కూడా వచ్చి ప్రిన్సిపాల్ తో మాట్లాడారు.
అయినా వారిని కళాశాల గేటు దగ్గరే నిలిపేశారు. పథకం ప్రకారం ‘పరివార్’ మూక రంగప్రవేశం చేసింది. కాషాయ కండువాలు, తల పాగాలు ధరించి ఉన్మాద ప్రదర్శన చేసింది. ఆ ఉన్మాదాన్ని మిగతా కొన్ని కళాశాలలకూ విస్తరింపజేసింది. తరువాతి క్రమంలో మొన్నటి మంగళవారం రోజు ఒక అమ్మాయి తన స్కూటీపై కళాశాలకు వచ్చి, స్టాండ్‌లో బైక్ పార్క్ చేసి నడుచుకుంటూ కళాశాలలోకి వెళుతుండగా సుమారు వంద మంది కాషాయ మూక ఒక్కసారిగా ‘జై శ్రీరామ్’ అని నినదిస్తూ హిజాబ్ తీసేయాలని ఆమెను చుట్టుముట్టింది. పైపైకి.. పైపైకి వెళ్ళి దాడి చేసినంత పని చేసి, భయభ్రాంతులకు గురి చేసింది. – ఇక్కడ ‘జై శ్రీరామ్’ అంటే, మనకు తెలిసిన శ్రీరామ చంద్రుడు కాదు. మనందరికీ తెలిసిన రాముడు ఒక ఒంటరి అమ్మాయిని వందమంది కలిసి అల్లరి చెయ్యమని, భయపెట్టమని, హింసించమని ఏనాడూ చెప్పలేదు. ఇతరులపై విద్వేషాన్ని నూరిపోయ లేదు – కాని ఆ అమ్మాయి అంతే ధైర్యంతో’ మీరెందుకిలా చేస్తున్నారు.. నా వస్త్రధారణ వల్ల మీకొచ్చిన నష్టం ఏమిటి.?’ అంటున్నా వినిపించుకోకుండా జై శ్రీరామ్ అంటూ ఉన్మాదంగా నినదిస్తూ తలపై వస్త్రం (హిజాబ్) తీసేయాలని ఇబ్బంది పెట్టింది అల్లరిమూక. అప్పుడా అమ్మాయి.. ‘నేను తీయను.. నన్ను మీరేమీ చేయలేరు.. నాకు దేవుడున్నాడు.. దేవుడే గొప్పవాడు.. దేవుడే గొప్పవాడు..’ (అల్లాహు అక్బర్ .. అల్లాహు అక్బర్ ) అని ప్రతి నినాదం చేస్తూ ముందుకు సాగిపోయింది. అల్లరి మూక అంతటితో ఆగకుండా ఈ వివాదాన్ని కర్నాటక రాష్ట్ర మంతా వ్యాపింప జేసింది. కళాశాలలు ఆందోళనలతో అట్టుడికాయి.
కర్ణాటక అంతా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. మొదట ఉడిపి, కోలార్ జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఈ ఆందోళనలు ఉద్రిక్తతలు మరింత విస్తరించాయి. మాండ్య, బాగల్‌కోటె, శివమొగ్గ, దావణగెరె, కల్బుర్గి లాంటి జిల్లాలో విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరస్పరం రాళ్లు రువ్వుకునే పరిస్థితికి దారితీసింది. ఫలితంగా 144 సెక్షన్‌ను విధించాల్సి వచ్చింది. ప్రభుత్వం మూడు రోజుల పాటు కళాశాలలకు సెలవులు కూడా ప్రకటించింది. మరోవైపు ఈ అంశంపై బుధవారం కూడా వాదనలు విన్న కర్నాటక హైకోర్టు కేసును విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేసి విచారించాలని నిర్ణయించింది. ఈ లోపులో రెండు వారాల పాటు రాష్ట్రంలో ఇరు వర్గాలూ ఎలాంటి ఆందోళనలూ చేపట్టకూడదని ఆంక్షలు విధించింది. అవసరమైతే ఆకాలంలో ఆన్‌లైన్ విద్యా విధానం అవలంబించాలని ప్రభుత్వానికి సూచించింది. పరిస్థితులు ఇంతగా దిగజారడానికి కారణమేమిటి.. కారకులెవరు? ఇది దేశానికి ప్రమాదం కాదా? బుద్ధిగా చదువుకోవాల్సిన యువకులను కాషాయ ధారులుగా మార్చి, ఇతరుల పట్ల విద్వేషం నూరిపోసి, భౌతిక దాడులకు సైతం ప్రోత్సహిస్తున్నది ఎవరు?
ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిద్దాం.. కళాశాలలో ప్రవేశం సమయంలోనే ఎంజిఎం యాజమాన్యం తమ కళాశాల నిబంధనలు వివరించి ఉండాల్సింది కదా.. జాయినింగ్ సమయంలో హిజాబ్‌లోనే వచ్చినప్పుడు ‘ఇక్కడ హిజాబ్‌కు అనుమతి లేదు’ అని అప్పుడే అభ్యంతరం చెప్పాల్సింది కదా… కాని అప్పుడేమీ మాట్లాడకుండా, కరోనా కారణంగా చదువులు నత్తనడక నడుస్తున్న సమయంలో, మరో రెండు నెలల్లో వార్షిక పరీక్షలు ఉన్నాయనగా అకస్మాత్తుగా హిజాబ్ తీసేసి వస్తేరండి.. లేకపోతే లేదు అనడం దారుణం కాదా.! ఇది ముస్లింలను విద్యకు దూరం చెయ్యడానికి బిజెపి ప్రభుత్వం పన్నిన ఒక దుర్మార్గమైన కుట్ర అంటే అది ముమ్మాటికీ నిజమే కదా.! మరో విషయం ఏమిటంటే, ఆ విద్యార్ధినులు హిజాబ్ తో వస్తే, అంటే నిండుగా వస్త్రాలు ధరించి వస్తే ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా.?
ఒకవేళ హిజాబ్ వల్ల ఎవరికైనా, ఏ విధమైన నష్టం కలిగినా.. ఇదిగో .. దీని వల్ల ఈ విధమైన ఇబ్బంది ఉంది.. నష్టం ఉంది.. అని చెప్పి అభ్యంతరం పెట్టవచ్చు. మరి అలాంటిదేమైనా ఉంటే కళాశాల యాజమాన్యం (ప్రభుత్వం) సమాధానం చెప్పాలి. ‘మేము కాషాయ కండువాలు ధరించి వస్తాము.. బొట్టు పెట్టుకొని వస్తాము..’ అని కొంత మంది పరివార్‌కు చెందినవారు అంటున్నారు. అలా వచ్చినా ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, అనేక మంది మగ విద్యార్ధులు పెద్ద బొట్టు పెట్టుకొని రావడం మనం చూస్తున్నాం. అందులో తప్పేమీ లేదు. అదనంగా కండువా వేసుకున్నా వచ్చే నష్టం ఏమీ లేదు. అంతే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక మంది పెద్దపెద్ద నామాలు పెట్టుకురావడం, అయ్యప్ప మాల ధరించి రావడం, సిక్కు సోదరులు తలపాగా, కృపాణం ధరించడం మనం చూడడం లేదా.? ఎవరూ ఏనాడూ అభ్యంతరం పెట్టలేదే.. ఎవరి ఇష్టం వారిది.. ఎవరి ఆచారం వారిది.. ఎవరి ధర్మం వారిది. రాజ్యాంగం మనందరికీ అలాంటి స్వేచ్ఛ ను, హక్కును ప్రసాదించింది.
అంతెందుకూ.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఎలాంటి వస్త్రాలు ధరిస్తాడో మనకు తెలియదా.? భారత ప్రధాని ఎన్ని రకాల వస్త్రాలు ధరిస్తారో, ఎలాంటి నామాలు పెడతారో, ఎన్ని వేషాలు వేస్తారో మనం రోజూ చూస్తూనే ఉన్నాం కదా.! మరి కేవలం ముస్లిం మహిళలు నిండుగా వస్త్రాలు ధరిస్తే వచ్చే ఇబ్బంది ఏమిటి? వారు ఎలాంటి వస్త్రధారణ చేసుకుంటే మనకొచ్చే నష్టమేమిటి.? ముస్లింలు వారికిష్టమైన వస్త్రాలు కూడా ధరించకూడదా.? వారి ధర్మాన్ని వారు ఆచరిస్తే, ఇతరులకు ఎందుకు బాధ కలుగుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు, అంతు చిక్కడంలేదు. హిజాబ్ తమ సంస్కృతికి, మతాచారాలకు, స్వేచ్ఛకు ప్రతీక అని, దానిపై ఆంక్షలు విధించడం సరికాదని ముస్లిం మహిళలు మొదట్నుంచీ మొత్తుకుంటున్నారు.
హిజాబ్ మా ఆత్మగౌరవ ప్రతీక అని చెబుతున్నారు. తమ వస్త్రధారణ ఎలా ఉండాలో నిర్ణయంచే హక్కు పరివారీయులకుగాని, ప్రభుత్వాలకుగానీ లేదనీ వారంటున్నారు. హిందూమతం నుంచి ఇస్లాంలోకి మారిన ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ కూతురు ఖదీజా సైతం, తాను స్వచ్ఛందంగానే బురఖా ధరిస్తున్నానని, అది ధర్మం తనకిచ్చిన గౌరవం అని గర్వంగా ప్రకటిస్తున్నారు. కనుక దుస్తుల విషయంలో ఆంక్షలు ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. ఇది స్వేచ్ఛకూ, సమానత్వానికీ రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకూ పూర్తి వ్యతిరేకం. ‘పరివార్’ శక్తులు తమ రాజకీయాధికారాన్ని కాపాడుకోడానికి, పాలూ పంచదారలా కలసిమెలసి హాయిగా బతుకుతున్న సోదర సమూహాల మధ్య కలహాలు రేపడానికి పన్నిన ఒక భయంకరమైన కుట్ర ఇది. దేశ వాసులు ‘పరివార్’ వలలో చిక్కకుండా విజ్ఞత, సంయమనం ప్రదర్శిస్తూ, పరస్పర అవగాహనతో మతోన్మాదుల ఆట కట్టించాల్సిన అవసరం ఉంది. ఇదే ఇప్పటి తక్షణ కర్తవ్యం.

యండి ఉస్మాన్ ఖాన్
9912580645

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News