Thursday, January 23, 2025

హిజాబ్ వివాదం!

- Advertisement -
- Advertisement -

 

covid 19 second wave in india కర్నాటకలో రగులుతున్న హిజాబ్ (ముస్లిం యువతులు ధరించే శార్ఫ్) వివాదం కేవలం కాషాయ శక్తులు అధికారంలో వుండే చోట మాత్రమే రగిలే విద్వేషకాండ అని ఢంకా బజాయించి చెప్పవచ్చు. బిజెపి ఎక్కడ అధికారంలో వుంటుందో అక్కడ ప్రజలను మత ప్రాతిపదిక మీద, మెజారిటీ మైనారిటీ ఆధారంగా విభజించి వారు పరస్పరం అనుమానంతో, భయంతో చూసుకుని బతికే స్థితి నెలకొంటుంది అనడానికి ఇది తాజా ఉదాహరణ. దీని వెనుక నేరుగా అక్కడి బిజెపి ప్రభుత్వ హస్తమే వుండడం గమనించవలసిన విషయం. గత నెల ప్రారంభంలో ఉడిపి ప్రభుత్వ ప్రీ యూనివర్శిటీ కాలేజీలో హిజాబ్ ధరించి వచ్చిన ఆరుగురు ముస్లిం విద్యార్థినులకు తరగతి గదుల్లోకి ప్రవేశం నిరాకరించడంతో ఈ వివాదం మొదలైంది.

హిజాబ్ ధారణకు వ్యతిరేకంగా కొన్ని కళాశాలల్లో హిందుత్వ యువకులు కాషాయ శాలువాలను ధరించి తిరగడంతో ఇది మత మలుపు తీసుకున్నది. విద్యా సంస్థల్లో అక్కడ నిర్ణయించిన యూనిఫాం దుస్తులనే విద్యార్థులు ధరించాలని కర్నాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు మత పరమైన ప్రత్యేక దుస్తుల ధారణను నిషేధిస్తున్నది. దీనిని కఠినంగా అమలు చేయడం ప్రారంభించిన తర్వాత హిజాబ్ ధరించి వచ్చే ముస్లిం విద్యార్థినులను అడ్డుకోడం మొదలైంది. ఇది ఒక విద్యా సంస్థ నుంచి మరో దానికి పాకుతూ సంక్షోభ స్థాయికి ఎదిగింది. ఉడిపి ప్రీ యూనివర్శిటీ కాలేజీలో హిజాబ్‌ను నిషేధించినందుకు నిరసనగా ఆందోళన చేస్తున్న ఆరుగురు విద్యార్థినుల్లో ఒకరు గత నెల 31న కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు.

హిజాబ్ ధారణ రాజ్యాం గం 14, 25 అధికరణలు హామీ ఇస్తున్న ప్రాథమిక హక్కు అని అందుచేత తాము హిజాబ్‌తో తరగతులకు హాజరు కావడానికి అనుమతించాలని ఆమె ఆ పిటిషన్‌లో హైకోర్టును అర్థించింది. దీని పై నేడు హైకోర్టు విచారణను చేపట్టవలసి వుంది. ఉడిపి కళాశాల ఉదంతం తర్వాత అదే జిల్లాలోని కుందాపూర్ ప్రీ యూనివర్శిటీ కాలేజీలో 28 మంది ముస్లిం విద్యార్థినులను హిజాబ్‌తో అనుమతించలేదు. ఇలా ఒక వైపు హిజాబ్ ధరించే ముస్లిం విద్యార్థినులు, వారి తలిదండ్రులు, మరో వైపు కాషాయ శాలువాల యువకుల మధ్య మత పరమైన ఘర్షణగా ఇది రగలడం ప్రారంభించింది. విద్యా సంస్థల్లో విద్య నేర్పడానికే ప్రాధాన్యమివ్వాలి గాని వారు ధరించే దుస్తులను భూతద్దంలో చూసి దానిని ఒక సమస్యగా రెచ్చగొట్టడం తగదు. సరైన దుస్తులు ధరించడమనేది ముఖ్యం గాని పలానా దుస్తులు మాత్రమే ధరించాలనడమూ ఒక పరిమితికి మించి ఆమోదించదగినది కాదు. సాధారణంగా ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు నిర్ణయించే యూనిఫాం దుస్తులను అక్కడి విద్యార్థి, విద్యార్థినులు గౌరవించి ధరిస్తూనే వుంటారు. హిజాబ్ వంటి మత విశ్వాస పరమైన వాటిని అదనంగా వేసుకుంటారు. దానిని వేలెత్తి చూపించి తరగతులకు అనుమతి నిరాకరించడం ఆ విద్యార్థుల విద్యార్జన హక్కును కాలరాయడం కిందికే వస్తుంది.

కర్నాటకలో ఈ వివాదం సహజంగానే రాజకీయ పార్టీల మధ్య విరుద్ధాభిప్రాయాలకు దారి తీసింది. పాలక భారతీయ జనతా పార్టీ హిజాబ్‌ను మత చిహ్నంగా చూస్తూ దానిని ధరించడాన్ని వ్యతిరేకిస్తున్నది. ప్రతిపక్ష కాంగ్రెస్ హిజాబ్ ధారణను సమర్థిస్తున్నది. మరో ప్రధాన రాజకీయ పక్షం జెడి(ఎస్) అటూ ఇటూ కాకుండా మధ్యస్థమైన వైఖరిని తీసుకున్నది. హిజాబ్‌తో తరగతులకు వెళ్లే హక్కు ముస్లిం విద్యార్థినులకున్నదని, పాలక బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు దానిని ఒక సమస్యగా చిత్రించి రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయంగా లాభపడాలని చూస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ శాసన సభా పక్ష నాయకుడు సిద్దరామయ్య అభిప్రాయపడుతున్నారు. బేటీ బచావో, బేటీ పడావో అని గొంతు చించుకునే ప్రధాని నరేంద్ర మోడీకి కర్నాటకలో హిజాబ్ పేరిట ముస్లిం ఆడ పిల్లలకు విద్యా హక్కును నిరాకరిస్తున్న విషయం తెలియదా అని కూడా సిద్దరామయ్య ప్రశ్నించారు.

పౌరులు తాము కోరుకునే మతాన్ని అవలంబించి దానికి సంబంధించిన దుస్తులను ధరించే హక్కును రాజ్యాంగం ఇస్తున్నదని, హిజాబ్‌ను నిషేధించడం ఈ ప్రాథమిక హక్కుకు విఘాతమని ఆయన అన్నారు. పాఠశాలలు సరస్వతీ దేవి ఆలయాలని అక్కడ హిజాబ్ వంటి వాటికి చోటు లేదని కర్నాటక రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు నళిన్ కుమార్ కటీల్ ప్రకటించారు. వాస్తవానికి సరస్వతిని విద్యా దేవతగా ఒక్క హిందువులు మాత్రమే పూజిస్తారు. ఇతర మతస్థులకు కూడా సమాన హక్కులున్న సెక్యులర్ భారతంలో ఆ విశ్వాసాన్ని అందరి మీదా రుద్దడం సమంజసం కాదనే అభిప్రాయాన్ని కొట్టి పారేయలేము. ఇంత వరకు హిజాబ్‌ను అనుమతిస్తున్న విద్యా సంస్థల్లో దానిని కొనసాగనివ్వాలని కొత్త సంస్థల్లో అనుమతించరాదని జెడి(ఎస్) అధినేత కుమారస్వామి సలహా ఇచ్చారు. కర్నాటక హైకోర్టు ఇచ్చే తీర్పు ఈ వివాదానికి తెర దించి ఆ రాష్ట్రంలో పిల్లల విద్యా హక్కును కాపాడుతుందని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News